అవసరమైతే యుద్ధమే.. | Sakshi
Sakshi News home page

అవసరమైతే యుద్ధమే..

Published Thu, Jul 17 2014 2:30 AM

అవసరమైతే యుద్ధమే.. - Sakshi

గవర్నర్‌కు అధికారాలపై సీఎం కేసీఆర్ హెచ్చరిక
 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంతో పోరాడుతాం

 
 సాక్షి, హైదరాబాద్: గవర్నర్‌కు విశేషాధికారాలు ఇవ్వడమంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించడమేనని, దీనిపై అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రం ఇలాగే ముందుకెళితే అఖిల భారత స్థాయిలో కేంద్రంపై పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకొని సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూముల ఆక్రమణల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని.. రాబోయే రోజుల్లో తన ఉగ్రనరసింహావతారాన్ని చూస్తారని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో ఇళ్లు, రేషన్‌కార్డులు సహా ప్రతీ అంశంలో వందలు-వేల కోట్ల అక్రమాలు జరిగాయని.. వాటన్నింటినీ సరిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణలోని ప్రాజెక్టులన్నింటిపై మళ్లీ సర్వే చేస్తామని.. నిపుణులు, అధికారులు, జర్నలిస్టులు సహా బృందాలుగా వెళ్లి ప్రాజెక్టు స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన చెంది రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, చావులు పరిష్కారం కాదని విన్నవించారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజుల కోసం ‘ఫాస్ట్’ పథకాన్ని అమలు చేస్తామని.. 1956 స్థానికత కేవలం ఈ పథకానికే పరిమితమని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పారు. ఇది కొత్త ప్రభుత్వమని, అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన అనంతరం కేసీఆర్ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అవి ఆయన మాటల్లోనే..
 
 ఉగ్రనరసింహావతారమే..!
 
 భూముల ఆక్రమణల విషయంలో ఏ మాత్రం రాజీపడం. ఆరునూరైనా సరే కబ్జాకు గురైన భూముల్ని రక్షిస్తం. రాబోయే రోజుల్లో ఉగ్రనరసింహావతారం చూస్తారు. గతంలో ఆడిన ఆటలు సాగవు. బాధ్యత కలిగిన పౌరసమాజం దిశలో చర్యలుంటాయి. హైదరాబాద్‌లో అనుమతుల్లేని భవనాలు 60 వేలదాకా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కోసం రెగ్యులేటెడ్ సిటీ అవసరం. అక్రమ భవనాల్ని కూల్చేస్తే కొన్ని పార్టీలు విచిత్రంగా స్పందిస్తున్నాయి. నాకు ఎవరిపైనా కక్ష లేదు. ఎవరి ఇళ్లు కూలగొడుతున్నారో? వారెవరో కూడా నాకు తెలియదు. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ఎవరితోనైనా ఎందుకు కక్ష ఉంటది? అవినీతిపరులు, అక్రమార్కులు, కబ్జాదారులపై మాత్రమే నా కక్ష. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు. నగరంలో ప్రతీ ఇంచు అగుపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నాలాల ఆక్రమణతో నాలుగు చినుకులు పడినా సిటీ అంతటా నీళ్లే నిలిచిపోతున్నాయి. హైటెక్ సిటీ అని చెప్పుకొనే వాళ్లు.. వానపడితే రాజ్‌భవన్, సీఎం ఆఫీసు, అసెంబ్లీ ముందు నీళ్లు ఆగుతుంటే ఏం సమాధానం చెబుతారు? భూదాన్ బోర్డు రద్దు చేశాం. రికార్డులను సీసీఎల్‌ఏ స్వాధీనం చేసుకుంది. కొంతమేరకు చట్టాన్ని మార్చాల్సిన అవసరముంది. అక్రమార్కుల చేతుల్లో ఒక్క అంగుళం కూడా ఉంచబోం. వారే స్వచ్ఛందంగా అప్పగించాలి. లేదంటే జైలుశిక్ష పడుతుంది.
 
  కఠినచర్యలు తప్పవు.
 
 అన్నింటా అక్రమాలే..
 ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో అరాచకం, వందలు- వేల కోట్లలో అక్రమాలు జరిగాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 593 గ్రామాల్లో ర్యాండమ్ సర్వే జరిపితే రూ. 235 కోట్ల అవినీతి బయటపడింది. రేషన్ కార్డులూ అంతే. బియ్యం పౌల్ట్రీఫారాలకు వెళ్తుంటుంది. అడ్డూఅదుపూ లేదు. దొంగలు దూరి వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. హౌసింగ్ కుంభకోణంపై విచారణ జరిపి ఎంతటివారైనా అక్రమార్కులను జైళ్లలో పెడతం. అనేక పథకాల సంగతి ‘చెబితే రామాయణం, వింటే భాగవతం..’ అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కుంభకోణం.. ఇళ్ల నిర్మాణం విష వలయం.. ఇలా ప్రతీ అంశంలోనూ విచ్చలవిడితనం. దీన్ని అరికట్టాలి. ‘మీ దగ్గర వికలాంగుల పెన్షన్‌లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎందుకున్నాయ్..? మీ రాష్ర్టం అంత కుంటిదా?’ అని ప్లానింగ్ అధికారులు అడిగితే సిగ్గుతో తలదించుకున్నా. ఇక నుంచి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ఇళ్ల కేటాయింపులకు మార్గదర్శకాల రూపకల్పన జరుగుతుంది. సోషల్ ఆడిట్, గ్రామసభల ద్వారా గ్రామకమిటీలు లబ్ధిదారుల ఎంపిక జరిపేలా విధానం ఉంటుంది.
 
 ల్యాంకో కూడ తప్పించుకోలేదు!
 
 వక్ఫ్ భూములను అనేక సంస్థలు ఆక్రమించాయి. వాస్తవానికి వక్ఫ్ స్థలాల కేటాయింపులో ప్రభుత్వమే మోసం చేసింది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన ల్యాంకో వంటి దొంగ సంస్థలను వదిలిపెట్టం. ముక్కుపిండి వసూలు చేస్తాం. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ సంస్థల ముసుగులో ల్యాంకో తప్పించుకోలేదు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌లకు వక్ఫ్ స్థలాల్లో ప్రభుత్వమే భూమి ఇచ్చింది. వీటికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూస్తది. అయితే ఈ విషయంలో కొన్ని పత్రికలు ఎంతో ఉదారంగా వార్తలు రాస్తున్నాయి.
 
 మా పిల్లలు.. సాయం మా ఇష్టం!
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్ మా పథకం కాదు. మేం ‘ఫాస్ట్’ పేరిట ఆర్థిక సాయం చేస్తాం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనిపై మాట్లాడితే సబ్ జ్యుడిస్ (కోర్టు ధిక్కరణ) అవుతుంది. ఏ ఒక్క తెలంగాణ విద్యార్థికి నష్టం జరగనివ్వను. ఇందుకు నాదీ పూచీ. 1956 సంవత్సరం స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది. మధ్యప్రదేశ్ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు కూడా దీనినే స్పష్టం చేశారు. మా పిల్లల కోణంలోనే మా నిర్ణయం ఉంటుంది. 1956 తర్వాత తెలంగాణలో కలిసిన గ్రామాల పరిస్థితిని పరిశీలించేందుకు కమిటీ ఉంటుంది. కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఏ ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా ఇబ్బందులు పడకుండా మా నిర్ణయం ఉంటుంది. మేం చట్టాల్ని ఉల్లంఘించడం లేదు. పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశాలు అని చట్టంలో పేర్కొంటే మేం సరేనన్నాం. ఒకవేళ ఎంసెట్ అడ్మిషన్లు రెండు నెలలు ఆలస్యమైతే.. విద్యా సంవత్సరాన్ని రెండునెలలు పొడిగిస్తం. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. అస్థిపంజరం (స్కెల్టన్) అడ్మినిస్ట్రేషన్‌తో పాలన చేస్తున్నాం.
 
 భూ కమతాల ఏకీకరణ..
 
 తెలంగాణలో నిజాం కాలం నాటి కమతాల ఏకీకరణ కార్యక్రమం చేపడతం. ఒక రైతుకు నాలుగైదుచోట్ల ఉన్న భూమిని ఒక్కచోటకు మార్చడమే దీని ఉద్దేశం. తెలంగాణలో ‘ర ద్దోబదలు’ పేరిట వ్యవహరించే ఈ పాత పథకాన్ని తిరిగి తీసుకొస్తం. నేను ఇన్నాళ్లుగా కావాలనే మీడియా ముందుకు రాలేదు. నిర్దిష్టమైన కార్యాచరణ, సంపూర్ణ అవగాహన వచ్చాకే మీడియాకు వివరించాలని అనుకున్నాను. గ్రామాల్లోనైతే 125 గజాల స్థలంలో, పట్టణాల్లో ఫ్లాట్లను 3 లక్షల వ్యయంతో నిర్మిస్తం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా రూ. 3.5 లక్షలైనా సరే రెండు పడక గదులు, కిచెన్, హాలుతో కూడిన ఇంటిని నిర్మిస్తం. చెత్త డంపింగ్ యార్డుల కోసం హైదరాబాద్ చుట్టూ 2,000 ఎకరాల స్థలం అవసరం. దీనికోసం సరైన పాలసీ రూపొందిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ప్రయత్నిస్తాం. 500 ఎకరాలు ఇస్తాం. దాంట్లో హార్టికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే ఏర్పాటవుతుంది. జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల భవన్‌ను దేశమే ఆశ్చర్యపడేలా నిర్మిస్తాం. కుటుంబంతో సాయంత్రం గడిపేందుకు ఆటస్థలం, పిల్లల పెళ్లిళ్లకు కమ్యూనిటీ హాలును నిర్మిస్తం. సీఎం సహాయనిధి సాయాన్ని నియంత్రణకు లోబడి ఇస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయంటున్నరు. తెలంగాణ వారికి రీయింబర్స్ చేస్తాం.
 
 కాగా ‘ప్రత్యేక ఇంక్రిమెంట్’ ప్రకటనపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేసీఆర్ మీడియా సమావేశం అనంతరం సచివాలయంలో భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 విద్యార్థుల ఫీజు కట్టలేరా?
 
 ‘‘1.5 లక్షల కోట్లతో రాజధాని నిర్మించుకునేవాళ్లు, ఇందుకోసం మంత్రుల బృందం సింగపూర్‌కు పోయేందుకు నిర్ణయించుకున్న ప్రభుత్వం.. మీ పిల్లలకు ఫీజులు ఇవ్వలేరా? మీ ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోండి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినీ గుర్తిస్తున్నాం. ఆయన మమ్మల్ని గుర్తించడం లేదు. నేను మాత్రం గౌరవిస్తున్నా... అవసరమైతే ఆయా విషయాలపై చర్చిస్తం. నాతోని నీ అవసరం, నీతోని నా అవసరం.. నీ ఇల్లు నాకెంత దూరమో, నా ఇల్లూ నీకంతే దూరం. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి..’’ అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము బస్తీమే సవాల్ అనడం లేదని, చీటికిమాటికీ కోర్టులకు వెళ్లడం లేదని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement