కడలిని కప్పేస్తున్న ప్లాస్టిక్‌ భూతం 

3 May, 2020 04:15 IST|Sakshi

డంపింగ్‌ యార్డులా మారిన సముద్రం

భూమిపై నివసించే ప్రజల బరువుతో సమానంగా ఏటా ప్లాస్టిక్‌ ఉత్పత్తి

ఏటా 8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి..

ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని చేపలు, తాబేళ్లు మృత్యువాత

సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగి.. రుతు పవనాల గమనానికి దెబ్బ 

యూఎన్‌ఈపీ అధ్యయనంలో వెల్లడి  

సాక్షి, అమరావతి: సముద్రం ప్లాస్టిక్‌ యార్డుగా మారింది. ప్రపంచంలో నివాసముంటున్న ప్రజల బరువుతో సమానంగా ప్లాస్టిక్‌ వస్తువుల ఉత్పత్తి అవుతుండగా.. ఏటా 8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నట్లు యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌ఈపీ) అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2050 నాటికి సముద్రంలో జలచరాల కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తిని చేపలు, తాబేళ్లు వంటి జలచరాలు అంచనాలకు అందని రీతిలో చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలే కారణమని.. ఇది రుతు పవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. 

అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. 
► ఏటా వివిధ రూపాల్లో 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల బరువుతో సమానం. 
► ఇందులో ఏటా 8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల ద్వారానే 70 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. 
► ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 90 శాతం వ్యర్థాలు ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే వస్తుండటం గమనార్హం. 
► సముద్రంలో నాచు (ఫైటో ప్లాంక్టన్‌)ను చేపలు, తాబేళ్లు ఎక్కువగా తింటాయి. ఈ నాచు డై మిథైల్‌ సల్ఫైడ్‌ అనే వాయువును విడుదల చేసింది. ఆ వాసన ఆధారంగానే నాచును పసిగట్టి చేపలు, తాబేళ్లు తింటాయి. 
► ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరాక నాచు లాంటి వాయువునే విడుదల చేస్తుండటం వల్ల.. చేపలు, తాబేళ్లు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని జీర్ణ క్రియ వ్యవస్థ దెబ్బతినడంతో మృత్యువాత పడుతున్నాయి.  
► ఇలా అంచనాకు అందనంత భారీ స్థాయిలో జలచరాలు మరణించడంతో మత్స్య సంపద విపరీతంగా తగ్గిపోతోంది. ఫలితంగా చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. 
► ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి రుతు పవనాల గమనం తీవ్రంగా దెబ్బతింటోంది. అనావృష్టి పరిస్థితులకు ఇదే కారణమవుతోంది.  పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రంలో జలచరాల పరిమాణం కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. 

మరిన్ని వార్తలు