జల‘వల’యంలో..

9 Sep, 2014 03:01 IST|Sakshi
జల‘వల’యంలో..

ఉప్పొంగుతున్న గోదావరితో లంకలకు ముప్పు
నీట మునిగిన కాజ్‌వేలు, నిలిచిన రాకపోకలు
పొలాలను ముంచెత్తుతున్న వరద నీరు
సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతవాసులు
నేడు ప్రవాహం మరింత ఉధృతమయ్యే అవకాశం!
 అమలాపురం : గోదావరి ఉప్పొంగుతోంది. పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పటికే అయిదారడుగుల లోతున నీరు ముట్టడించడతో పలు లంక గ్రామాలు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగి, సుడిగుండంలో చిక్కుకున్న చీమల్లా తల్లడిల్లుతున్నాయి. గంటగంటకూ ప్రవాహం ఉధృతమవుతుండడంతో లంకవాసులు భీతిల్లుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాధితులు ముఖ్యమైన సామగ్రిని వెంట తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు.

వరద పోటెత్తడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద సోమవారం సాయంత్రం 4.45 గంటలకు రెండో ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో 13.54 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. ఎగువన కాళేశ్వరం, దుమ్ముగూడెంలలో వరద ఉధృతి తగ్గుతున్నా.. అక్కడ ఇంతకు ముందున్న ఉరవడి బ్యారేజికి చేరేసరికి దిగువకు 16.50 లక్షల క్యూసెక్కుల వరకు విడుదల చేసే అవకాశముందని, మంగళవారం మధ్యాహ్నం వరకు వరద ఉధృతి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అంటే అనంతరం కూడా దిగువన .. ముఖ్యంగా కోనసీమ మండలాలకు వరద ప్రమాదం కొనసాగుతుందన్న మాట. దీనికి తోడు సోమవారం పౌర్ణమి కావడంతో సముద్రం పోటు మీద ఉండి, నీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఇది కూడా వరద ముంపు పెరగడానికి కారణమవుతుంది. వరదకు అల్పపీడనం తోడుకావడంతో  తీరప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి, గంటకు 45 నుంచి 50 మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ ప్రకటించడం అధికారయంత్రాగానికీ కునుకు లేకుండా చేస్తోంది.
 
జలదిగ్బంధంలో దేవీపట్నం మండల గ్రామాలు
వరద పోటెత్తడంతో బ్యారేజికి ఎగువన దేవీపట్నం మండలం నుంచి దిగువన సఖినేటిపల్లి మండలం వరకు గోదావరి పాయల మధ్య ఉన్న లంకలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. దేవీపట్నం మండలంలో ఇప్పటికే 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద వడి ఎక్కువగా ఉండడంతో కొండమొదలు, తుండూరు గ్రామాలకు పడవలపై వెళ్లేందుకు సహాయక సిబ్బంది, ఇతర గ్రామాల వారు ముందుకు రావడం లేదు. ముంపుబారిన పడ్డ వీరవానిలంకవాసులను దేవీపట్నం మండల పరిషత్ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు.

కొండమొదలు, తున్నూరు, మంటూరు, దేవీపట్నం పంచాయతీలకు చెందిన సుమారు 800 ఎకరాల్లో మినుము, ప్రత్తి, వరి పంటలు నీట మునిగాయి. వీరవరంలంకకు చెందిన 15 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తొయ్యేరుకు చెందిన 75 మందిని హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. దేవీపట్నం మత్స్యకార కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రాజమండ్రి బ్రిడ్జిని ఆనుకున్న ఉన్న లంకలు మునగడంతో అక్కడ నివసించే 45 కుటుంబాల వారిని నగరంలోని చందా సత్రానికి తరలించారు. సీతానగరం మండలం ములకల్లంకలో వరదనీరు రోడ్డును ముంచెత్తుతోంది.
 
కోనసీమలో పలు లంకలను చుట్టుముడుతున్న వరదనీరు
బ్యారేజి దిగువన పరిస్థితి రానురాను ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికికే జిల్లాను ఆనుకుని పశ్చిమ గోదావరి పరిధిలోకి వచ్చే పి.గన్నవరం సమీపంలోని కనకాయిలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, పెదమల్లంకకు రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయిలంకకు వెళ్లే కాజ్‌వేపై ఐదడుగుల లోతున నీరు చేరడంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం మండల పరిధిలో గంటి పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంకలకూ రాకపోకలు నిలిచిపోయాయి.

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం కాజ్‌వైపే నాలుగడుగుల నీరు చేరింది. మండలంలోని పొట్టిలంక, చింతనలంక, కొండుకుదురులంక, అయినవిల్లిలంకలను వరదనీరు చుట్టుముడుతోంది. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే కూడా మంగళవారం ఉదయానికి నీట మునిగి రాకపోకలు నిలిచే స్థితి కనిపిస్తోంది. ఈ మండలంలో అప్పనపల్లి- ఉచ్చిలివారిపేట రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.

ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక, గురజాపులంక, కమిని, పశువుల్లంక మొండి తదితర గ్రామాలు కూడా ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని లంకల్లోని పొల్లాలోకి వరదనీరు చేరుతోంది. దీనితో రైతులు వ్యవసాయ పంటలను, పశువులను రక్షించుకునే పనిలో పడ్డారు. పశువులను ఏటిగట్ల మీదకు తరలిస్తున్నారు. రావులపాలెం, ఊబలంకల వద్ద పంట పొలాల్లోకి వరదనీరు చొచ్చుకువస్తోంది.
 
జిల్లాయంత్రాంగం అప్రమత్తం
కాకినాడ సిటీ : వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ నీతూ ప్రసాద్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆమెతోపాటు జేసీ ఆర్.ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, డీఆర్‌ఓ బి.యాదగిరి, వివిధ శాఖల అధికారులు వరదను ఎదుర్కొనే విధుల్లో నిమగ్నమయ్యారు. కాగా రాజమండ్రి, రంపచోడవరం, అమలాపురం డివిజన్లలో పల్లపు ప్రాంతాల్లోని 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆశ్రయం కల్పించామని కలెక్టర్ తెలిపారు.
 
వరద ముట్టడిలో ఏడుగురు రైతులు

అయినవిల్లి : వీరవల్లిపాలెంకు చెందిన ఏడుగురు పాడి రైతులు పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని గాజుల్లంకకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్నారు. రోజూలాగే సోమవారం గాజుల్లంకలోని పశువులను మేపడానికి వెళ్లిన  వల్లపురెడ్డి పుల్లయ్య, దాసి డీలరు, దామిశెట్టి ఎర్రోడు, అడపా సూరిబాబు,  అడపా పండు, మరో ఇద్దరు గౌతమి గోదావరి పరవళ్లు తొక్కడంతో అక్కడే చిక్కుకుపోయారు. వారిని ఇంజన్ పడవల సహాయంతో బయటకు చేర్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు