గ్రామ కార్యదర్శులకు మరిన్ని అధికారాలు

26 Dec, 2013 04:08 IST|Sakshi

చిలుకూరు, న్యూస్‌లైన్: గ్రామపంచాయతీ పాలనను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు నెలలకోసారి గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సభలకు హాజరుకాని మండలస్థాయి అధికారులపై నివేదిక పంపేలా గ్రామకార్యదర్శులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జీఓ నంబర్ 791ని జారీ చేసింది.
 
 జిల్లా వ్యాప్తంగా 1165 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలకు పాలకవర్గాలు కూడా వచ్చాయి. అయితే గతంలో గ్రామసభలు మొక్కుబడిగా నిర్వహించేవారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగేది కాదు. దీంతో పంచాయతీల పాలన సజావుగా కొనసాగేలా చూడడమే గాక గ్రామంలో నెల కొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారిం చింది. ఈ నేపథ్యంలో గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుం టోంది. అందులో భాగంగానే పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెడుతూ జీఓ నంబర్791ని విడుదల చేసింది.
 
 పరిష్కారం కానున్న సమస్యలు
 గతంలో గ్రామ సభలకు మండల స్థాయి అధికారులు రాకపోయినా గ్రామ కార్యదర్శులు వాటిని నిర్వహించేవారు. దీంతో గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు, డ్రెయినేజీ తదితర సమస్యలు పరిష్కారంగాక దీర్ఘకాలికంగా ఉండేవి. అలాగే ఏయే అధికారులు గ్రామసభలకు హాజరైన విషయం కూడా ఉన్నతాధికారులకు తెలిసేదికాదు. కానీ ఈ జీఓ ప్రకారం.. ఏడాదిలో నాలుగు పర్యాయాలు నిర్వహించే గ్రామ సభలకు ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో నెలకొన్న దీర్ఘ కాలిక సమస్యలను గ్రామ ప్రజలు మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అవి పరిష్కారమయ్యే అవకాశం చాలావరకు ఉంది.
 
 జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక
 గ్రామ సభలకు రాని మండల స్థాయి అధికారులపై ఆయా గ్రామాల కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆయా గ్రామాల కార్యదర్శులు గ్రామసభలను తూతూ మంత్రంగా నిర్వహించినా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. కానీ ఈ జీఓ ప్రకారం గ్రామ సభలను పక్కాగా మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది.
 
 వేధిస్తున్న కార్యదర్శుల కొరత
 ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి ఇప్పటికే రెండు నుంచి మూడు గ్రామపంచాయతీలకు ఒక ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ జీఓతో కార్యదర్శులకు మరింత భారంగా మారనుంది. గ్రామ సభలకు రాని మండలస్థాయి అధికారులపై తాము ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. తమకు చిక్కులు తప్పవని వారు పేర్కొంటున్నారు.   
 

మరిన్ని వార్తలు