కన్నతల్లిని కంటికి రెప్పలా చూడాలి 

11 Oct, 2019 06:54 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : కన్న తల్లి యోగక్షేమాలను జీవితాంతం కన్న బిడ్డలే చూడాలని ఆదేశిస్తూ సీనియర్‌ సిటిజన్స్‌ మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే తన్ని తరిమేయడంతో తనకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధురాలు స్పందనలో ఇచ్చిన అర్జీ ఆధారంగా ట్రిబ్యునల్‌ విచారించింది. ప్రతీ నెలా పోషణ ఖర్చులు ఇస్తూ జీవితాంతం ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలని తీర్పు నిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.  కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన కొండపల్లి ఖైరున్నీసా(92)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఉయ్యూరు పంచాయతీ వార్డు సభ్యురాలిగా పనిచేసిన ఖైరున్నీసాకు తన భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులను కుమారులు తమ పేరిట రాయించుకుని ఇంటి నుంచి తన్ని తరిమివేశారు.

ఆమె తనకు న్యాయం చేయాలంటూ గత నెల 9వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ను కలిసి మొర పెట్టుకుంది. అదే రోజు ఆమె మనో వేదనకు అక్షరరూపమిస్తూ ‘‘కన్నబిడ్డలే కాదు పొమ్మన్నారు’’ అనే శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌ ఎడిషన్‌లో ప్రచురించిన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. కలెక్టర్‌ ఈ కేసును  సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌కు అప్పగించారు. ట్రిబ్యునల్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పున్డ్కర్‌ ఖైరున్నీసా  కుమారులైన మొహమ్మద్‌ యాకుబ్, అబ్దుల్‌ కలాం, సనావులకు నోటీసులు జారీ చేసి విచారించారు.

ఇక నుంచి తల్లిని బాగా చూసుకుంటామని కుమారులు ముందుకొచ్చినా వారి వద్ద ఉండేందుకు ఖైరున్నీసా ఇష్టపడలేదు. దీంతో ఓ అటెండర్‌ సహాయంతో విడిగా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని కుమారులను ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఆమె పోషణ నిమిత్తం ప్రతి నెలా సంతానం నలుగురూ రెండేసి వేలు చొప్పున ఆమె బ్యాంకు ఖాతాలో వేయాలని, అలాగే క్రమం తప్పకుండా ఆమె బాగోగులు చూస్తుండాలని ఈ నెల 1వ తేదీన ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమానికి, తన మనోవేదనను అర్థం చేసుకున్న ‘సాక్షి’ పేపర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఖైరున్నీసా అన్నారు.  

మరిన్ని వార్తలు