‘స్మార్ట్ సిటీ’ దిశగా కదలిక

28 Jul, 2014 02:54 IST|Sakshi
‘స్మార్ట్ సిటీ’ దిశగా కదలిక

తిరుపతిని స్మార్ట్ సిటీగా అభి వృద్ధిచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తిరుపతిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించే బాధ్యతను రాష్ట్ర ప్రణాళికా విభాగం ఓఎస్డీ విశ్వనాథ్‌కు అప్పగించా రు. ఆ నివేదిక ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడానికి టెండర్ పిలవాలని నిర్ణయించారు.    
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకు బడ్జెట్లో రూ.7060 కోట్లను కేటాయించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుపతిని కూడా కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రూపొందించే పనిని రాష్ట్ర ప్రణాళిక విభాగం ఓఎస్డీ విశ్వనాథ్‌కు అప్పగించారు.

జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, ప్రణాళిక విభాగం ఓఎస్డీ విశ్వనాథ్, ఆర్డీవో రంగయ్య ఇటీవల సమావేశమయ్యారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని నిర్ణయించారు. తిరుపతి నగరంతోపాటూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించడంతో.. రెవెన్యూ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

ఇక తిరుపతిలో 2050 నాటికి పెరిగే జనాభా.. భక్తుల సంఖ్యను అంచనా వేసి, అప్పటి అవసరాలను తీర్చేలా రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. తిరుపతి నగరంలో తిరుపతి ఈస్డ్, తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ రైల్వేస్టేషన్‌నే అధికంగా వినియోగించుకుంటున్నారు. తిరుపతి ఈస్ట్ రైల్వేస్టేషన్ తరహాలోనే వెస్ట్‌తోపాటూ మరో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసే బాధ్యతను ఆ శాఖ అధికారులకు అప్పగించారు.

తిరుపతికి ఉత్తరం వైపున ఏడుకొండలు విస్తరించి ఉన్నాయి. నగరాన్ని విస్తరించాలంటే.. తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశల వైపు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. నగరాన్ని విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ప్రణాళికా విభాగం ఓఎస్డీ విశ్వనాథ్ రూపొందించే ప్రాథమిక నివేదిక ఆధారంగా తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారుచేయడానికి గ్లోబల్ టెండరు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌కు టెండర్లు పిలవడానికి కనీసం ఆర్నెళ్లు పట్టే అవకాశం ఉందని తిరుపతి కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు