ఆపరేషన్‌ స్టువర్టు @107

5 Jun, 2020 08:28 IST|Sakshi
దొంగలను ఉంచేందుకు బ్రిటిష్‌ హయాంలో ఏర్పాటు చేసిన జైలు 

గజదొంగల్లో మార్పు తెచ్చిన ఒక అధికారి ఆలోచన 

విద్యతో మార్పునకు నాంది పలికిన సాల్వేషన్‌ ఆర్మీ 

సాక్షి, బాపట్ల: గజదొంగలలో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయోగానికి 107 ఏళ్లు నిండాయి. దొంగలలో మార్పు తీసుకురావటంతోపాటు సమాజంలో గౌరవపదమైన జీవితాన్ని గడిపించేందుకు మేజర్‌ మెకర్జీ, నాటి తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌ స్టూవర్టు చేసిన ప్రయత్నం ఫలించింది. 1913లో ఆపరేషన్‌ స్టువర్టు పేరుతో 200 మంది గజదొంగలపై చేసిన ప్రయోగం చివరికి దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేకత సంతరించుకుంది. అప్పటి పాలకుల లక్ష్యానికి ధీటుగా స్టూవర్టుపురం ప్రాంత ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు.   

స్టువర్టుపురం ఏర్పడింది ఇలా... 
ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో దొంగలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన్పటి ఫలించలేదు. అయితే 1913 సంవత్సరంలో బాపట్ల ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఇంగ్లండ్‌ దొర మేజర్‌ మెకర్జీ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రాధాన్యత చూపాలని కోరగా అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ స్టూవర్టు మెకర్జీ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. అయితే దొంగలను కూడా అదే ప్రాంతంలో ఉంచి పునారావాసం కల్పించేందుకు కృషి చేయాలని కోరగా ఇద్దరు తెల్లదొరల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా స్టూవర్టుపురం ఎర్పడింది. ప్రభుత్వం మూడు వేల ఎకరాలు స్థలాన్ని సాల్వేషన్‌ ఆర్మీకి అప్పగించగా అందులో 200మంది దొంగలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల పొలం కేటాయించి వ్యవసాయం చేయించేందుకు పెట్టుబడులు కూడా సాల్వేషన్‌ ఆర్మీ ఇచ్చింది.  

స్టువర్టుపురంలోని హైస్కూలు
ప్రతి రోజు హాజరు వేయాల్సిందే... 
అప్పట్లో ఉదయం పూట వ్యవసాయం చేయటంతోపాటు రాత్రి తొమ్మిదిగంటలకు ప్రతి దొంగ వచ్చి సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే ఆరోజు రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినప్పటికి ఆ నేరం వీరిపై వేయటం జరిగేది. దీంతో శిక్ష వేసేందుకు స్థానికంగా జైలును కూడా ఏర్పాటు చేశారు. ఈవిధంగా కాలక్రమేణ దొంగతనాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. సాల్వేషన్‌ ఆర్మీ పేరుతో ఉన్న పొలాలకు 1997 సంవత్సరంలో ప్రభుత్వం వ్యక్తిగత పట్టాలు ఇచ్చి వారికి మరింత చేయూతనిచ్చింది. ఈ పొలాలలో వరి, ఆకుకూరలు, పూలమొక్కలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  చదవండి: ఆమెకు 25.. అతడికి 18..  

విద్యా వ్యాప్తికి కృషి 
విద్యావ్యాప్తికి సాల్వేషన్‌ ఆర్మీ కృషి మొదలుపెట్టింది. 1914లో రక్షణ సైన్యం పేరుతో పాఠశాలకు రూపకల్పన చేసింది. ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు జిల్లా బాపట్లకు మధ్యలో హైస్కూలు లేకపోవటంతో పలు గ్రామాలకు చెందిన వారు చదువుకునేందుకు స్టూవర్టుపురంలో ఏర్పాటు చేసిన సాల్వేషన్‌ ఆర్మీ ఏర్పాటు చేసిన రక్షణసైన్యం స్కూలులో చేరారు. ఈ పాఠశాల ఏ ముహుర్తన ప్రారంభించారోగానీ ఇక్కడ చదివిన చాలా మంది విద్యార్థులు దేశ,రాష్ట్ర పరిపాలనలో చోటు సంపాదించుకున్నారు. పరిపాలన వ్యవహారాలలో ఐఏఎస్‌ నుంచి జాతీయ కమిషన్‌ చైర్మన్‌ హోదా వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.  

ఉన్నత శిఖరాలకు చేరిన వారు ..
దేవర రాజగోపాల్‌ (ఐఎఎస్‌), పాలపర్తి వెంకటేశ్వర్లు (ఐఏఎస్‌), దేవర సుబ్బారావు (ఎస్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌), ఏడుకొండలు (ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌), దేవర, నాగరాజు (సేల్స్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌),  చిన్నపోతుల ప్రసాదరావు (అసిస్టెంట్‌ కమిషనర్‌), బి.ప్రేమకుమారి (సబ్‌ కలెక్టర్‌), శర్మరావు (డివిజనల్‌ రైల్వే మేనేజర్‌), కొండా వణీష్‌, నిరంజన్‌(ఎంఈఓలు) తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ యూనివర్శిటీలలో అధ్యాపకులుగా చాలా మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు