-

లాహిరి లాహిరి లాహిరిలో..

15 Feb, 2018 10:51 IST|Sakshi

టూరిజం స్పీడు బోటు షికారు

10 సీట్ల సామర్థ్యంతో అందుబాటులోకి..

నెలాఖరు నుంచి ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం సరికొత్త స్పీడు బోటు సిద్ధమైంది. సాగరంలోకి రయ్‌ను దూసుకుపోయే ఈ బోటు నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ చాన్నాళ్లుగా 40 మంది కూర్చునే వీలున్న ‘స్వర్ణవిహారి’ పాత బోటును నడిపేది. గత నవంబర్‌ 12న విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పర్యాటకశాఖ బోటు బోల్తాపడిన ప్రమాదంలో 25 మందికి పైగా మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందిన పర్యాటకశాఖ అధికారులు అప్పటికే అంతగా ఫిట్‌నెస్‌ లేని స్వర్ణ విహారిని నిలిపివేశారు. దీంతో విశాఖ ఆర్కే బీచ్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు బోటు షికారు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుషికొండలో పర్యాటకశాఖ నడుపుతున్న నాలుగు సీట్ల స్పీడ్‌ బోటు మాత్రమే పర్యాటకులకు అరకొరగా సరదా తీరుస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ విహారికి మళ్లీ మెరుగులు దిద్ది పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో పర్యాటకశాఖ అధికారులు 10 సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త స్పీడు బోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బోటును ఫిషింగ్‌ హార్బర్‌లోని 11వ నంబరు జెట్టీ నుంచి నడపనున్నారు. ఇందులో ఇద్దరు డైవర్లు (గజ ఈతగాళ్లు–వీరే బోటును కూడా నడుపుతారు) కాగా మిగిలిన వారు పర్యాటకులుంటారు. ఈ బోటు 11వ నంబరు జెట్టీ నుంచి ఆర్కే బీచ్‌ వరకు సముద్రంలోకి తీసుకెళ్లి తీసుకొస్తారు.

టిక్కెట్టు ధర రూ.250..
ఒక్కొక్కరికి రూ.250 టిక్కెట్టు ధర నిర్ణయించారు. రుషికొండలో నడుస్తున్న స్పీడ్‌ బోటులో షికారు చేసే వారికి ఒక్కొక్కరికి రూ.300 టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. ఎక్కువ సామర్థ్యం ఉండడం, డీజిల్‌ నడవడం వల్ల స్వర్ణ విహారి బోటులో టిక్కెట్టు ధర రూ.60లే ఉండేది. కానీ ఈ స్పీడు బోటు పెట్రోల్‌తో నడిచేది కావడం, తక్కువ మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో ఈ బోటు షికారుకు రూ.250 టిక్కెట్టుగా నిర్ణయించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్పీడు బోటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపనున్నారు. ఈ బోటు సర్వీసును ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు