టోర్ని విజేత విజయవాడ

27 Feb, 2017 08:37 IST|Sakshi
► ముగిసిన అంతర్‌ రాష్ట్రాల వెటరన్‌ క్రికెట్‌ టోర్నీ  
► రన్నరప్‌గా హైదరాబాద్‌
► ట్రోఫీలు బహుకరించిన జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు
 
కడప స్పోర్ట్స్‌ :
కడప నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఎం. చంద్రశేఖరరెడ్డి స్మారక అంతర్‌ రాష్ట్రాల వెటరన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా విజయవాడ జట్టు నిలిచింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టుపై విజయవాడ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి ట్రోఫీలను అందజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్‌ క్రికెటర్లు మంచి ఆటతీరుతో అలరించారన్నారు. వయసుతో సంబంధం లేకుండా యువ క్రికెటర్ల మాదిరిగా చక్కగా పోటీపడ్డారన్నారు.జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఆడటం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌. జిలానీబాషా మాట్లాడుతూ క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచే ఇటువంటి టోర్నమెంట్‌లు మరిన్ని నిర్వహించాలన్నారు.
 
అనంతరం వివిధ విభాగాల్లో రాణించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వీకే హోండా అధినేత కరుణాకర్‌రెడ్డి, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కోశాధికారి వై. శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సంజయ్‌కుమార్‌రెడ్డి, ఎ.నాగసుబ్బారెడ్డి, సభ్యులు భరత్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, శేఖర్, ఖాజామైనుద్దీన్‌ పాల్గొన్నారు.
 
హైదరాబాద్‌పై విజయవాడ విజయకేతనం
వెటరన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌మ్యాచ్‌లో విజయవాడ, హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. జట్టులోని బాపిరాజు 62 పరుగులు, పి.శ్రీనివాస్‌ 25 పరుగులు, జనార్దన్‌ 23 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లు నదీమ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
మరిన్ని వార్తలు