అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి

Published Tue, Feb 28 2017 3:07 AM

అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి


పీటన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జాతివిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య ఘటన మరువకముందే మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా జాతివిద్వేష పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు కొట్టారు. గోడలపై కుక్క మలాన్ని పూశారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద పోస్టర్లు అతికించారు. పోస్టర్లపై ‘గోధుమ వర్ణం వారు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు’ అనే రాతలు రాశారు.

అయితే.. ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అంతేకాదు.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని, తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయంగా వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని చెప్పారు. కానీ మళ్లీ తన ఇంటిపై ఇలాంటి దాడి జరుగుతుందోమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసి ఉంటారని ఎఫ్‌బీఐ భావిస్తోంది.
 
అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి...
 

 

Advertisement
Advertisement