ముఖ్యమంత్రి అయినా సరే.. 'మాట' వినం

27 Feb, 2017 08:37 IST|Sakshi
ముఖ్యమంత్రి అయినా సరే.. 'మాట' వినం

పట్నా: ముఖ్యమంత్రి సహా ఎవరి మౌఖిక ఆదేశాలనూ అమలు చేయరాదని బిహార్ బ్యూరోక్రాట్లు నిర్ణయించారు. లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తేనే అమలు చేస్తామని చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో బిహార్ స్టాఫ్‌ సెలెక్షన్ కమిషన్ చైర్మన్ సుధీర్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమైంది.

ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు పలు విషయాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిహార్ సీఎం నితీష్‌ కుమార్ ఆదేశాలైనా లిఖిత పూర్వకంగా జారీ చేస్తేనే అమలు చేయాలని నిర్ణయించారు. ఇకమీదట ఉద్యోగ నియామకాల బోర్డులకు చైర్మన్‌గా ఐఏఎస్ అధికారులు ఉండరాదని తీర్మానం చేశారు. ఎవరో చేసిన కుట్రలో సుధీర్‌ కుమార్‌ ఇరుకున్నారని, ఆయన న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించారు. సుధీర్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని, బిహార్ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, స్టాప్‌ సెలెక్షన్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశానంతరం ఐఏఎస్ అధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాజ్‌భవన్ ఎదుట మానవహారం నిర్వహించారు.

కాగా పోలీసుల వాదన మరోలా ఉంది. తన బంధువుల కోసం సుధీర్ కుమార్ ప్రశ్నా పత్రాలను లీక్ చేశారని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసిన 48 గంటల తర్వాత కూడా స్టాఫ్‌ సెలెక్షన్ కమిషన్ చైర్మన్‌గా కొనసాగారు. ఆయన్ను పదవి నుంచి తొలగించడం లేదా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు. సుధీర్ కుమార్ ప్రస్తుతం పట్నా పుల్వారిషరీఫ్‌ జైలులో ఉన్నారు. పేపర్ లీక్ కావడంతో దాదాపు 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియను సీఎం నితీష్ కుమార్ రద్దు చేశారు. ఈ కేసులో దాదాపు 36 మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్నా పత్రం కోసం ఒక్కో అభ్యర్థి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు చెల్లించారు.

మరిన్ని వార్తలు