చదివేదెలా..?

22 Oct, 2017 15:19 IST|Sakshi

ప్రాణాల్ని తోడేస్తున్న బలవంతపు చదువులుజిల్లాలోనూ ‘నారాయణ’ పాపాలు

వేధింపులు భరించలేక ఇప్పటికే జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య

‘నారాయణ’లో చదివించేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు

జిల్లాలో ఆ కళాశాలలో చేరికలు తగ్గుతున్న వైనం...

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇవన్నీ నారాయణ కళాశాల పాపాలే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల్లో కడుపు కోతను మిగిల్చాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఆత్మహత్యల నేపథ్యంలో జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి నెలకుంది.

వేధింపులు...సతాయింపు
సకాలంలో ఫీజులు కట్టకపోతే వేధింపులు...ఇరుకిరుకు గదులు...కడుపునింపని భోజనాలు ...ఆశించిన మార్కులు రాకపోతే సతాయింపు....అంటగడుతున్న బలవంతపు చదువులు...రేటింగ్‌ పెంచుకోవడానికి విద్యార్థులను ఆయుధాలుగా వాడుతున్న పరిస్థితి...ఇలా ఒకటేంటి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా నారాయణ కళాశాలలపై అనేక ఆరోపణలున్నాయి. బలవంతపు చదువులు అంటగడుతూ ప్రాణాలను తోడేస్తున్నాయి. కార్పొరేట్‌ కలరింగ్‌లో తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేస్తున్నాయి. మానసిక ఒత్తిడికి గురి చేసి మరణ శాసనాలను లిఖిస్తున్నాయి. విద్యార్థులను మార్కుల యంత్రాలుగా వాడుతున్నాయి. మార్కుల వేటలో మానసిక ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కార్పొరేట్‌ కళాశాలలో చదవితే ప్రయోజకులవుతారన్న ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి.

నారాయణలో చదివేందుకు వెనుకంజ...
రోజురోజుకీ పరిస్థితి దయనీయంగా మారడం, విద్యార్థుల జీవితాలకు గ్యారంటీ లేకపోవడంతో నారాయణ కళాశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు సైతం క్రమేపీ వెనుకంజ వేస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో నారాయణ కళాశాలల్లో గతంలో 15 బ్రాంచీలుడగా వాటిలో 15 వేల మంది విద్యార్థులు చదువుతుంటేవారు. యాజమాన్య విధానాలు, ఒత్తిడి, చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలతో కళాశాలల సంఖ్య జిల్లాలో ప్రస్తుతం ఆరుకు చేరింది. విద్యార్థులు 50 శాతం మంది పైగా తగ్గిపోయారు.కళాశాల యాజమాన్యం వేధింపుల ధోరణి, నిర్వహణ, పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం లేకపోవడంతో విద్యార్థులు నారాయణ కళాశాలల్లో చేరడంలేదన్న వాదనలున్నాయి. ఫలితంగా చాలావరకు హాస్టళ్లు మూసేసినట్టు సమాచారం. తరగతి గదులు ఇరుకు,ఇరుకుగా, చీకటిగా ఉంటాయని, రోజంతా విద్యుత్తు దీపాలతోనే తరగతులు బోధిస్తున్న పరిస్థితులున్నాయి. గాలిరాక విద్యార్థులు ఉక్కపోతకు గురవుతుంటారని, ఏసీ తరగతి గదులు పేరుకే కానీ అవి సక్రమంగా ఉండవనే వాదనలున్నాయి.

జిల్లాలో ప్రైవేటు కళాశాలలు ఇలా...
జిల్లాలో మొత్తం 282 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలుండగా వాటిలో జనరల్‌లో 201, ఒకేషనల్‌లో 81 కళాశాలలున్నాయి. వీటిలో 35 వేలమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఇక హాస్టళ్ల విషయానికి వస్తే రాజమహేంద్రవరం దానవాయిపేటలో గతంలో నారాయణ రెండు హాస్టళ్లుండేవి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో హాస్టళ్లను మూసివేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్‌ తిరుమల కళాశాలలో ఒకటి, శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచి, ప్రతిభ జూనియర్‌ కళాశాలకు ఒక హాస్టల్‌ రాజమహేంద్రవరంలో ఉండగా, కాకినాడలో నారాయణకు ఒక హాస్టల్‌ ఉంది.

ఆత్మహత్యల వివరాలు ఇలా...
04 సెప్టెంబర్‌ 2015 : తాడితోట షెల్టాన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో యాజమాన్యం ర్యాంకుల వేధింపులు తాళలేక ఇంటికి వెళ్లి ఇంటర్‌ చదువుతున్న పెదపాటి రాజేశ్వరరావు బాత్‌రూమ్‌లో ఆత్మహత్యచేసుకున్నాడు. తండ్రి జోగేశ్వరరావు బంగారు ఆభరణాల తయారీ పని చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలుకరించగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. కళాశాల ఫీజు చెల్లించడంలో కొద్ది రోజులు ఆలస్యమైతే యాజమాన్యం తరగతి గదిలో అందరిముందు అవమానించేలా ఫీజు కట్టని విద్యార్థులను అవమానించడంతో సున్నిత మనస్కుడైన అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసమైతే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అడగాలే తప్ప విద్యార్థులను నిలదీయడం మంచి పద్దతికాదన్నారు.

13 అక్టోబర్‌ 2015 : పాలకొల్లుకు చెందిన నందిని అనే విద్యార్థిని తల్లి రాజమహేంద్రవరంలో నర్స్‌గా పనిచేస్తుండడంతో ఆమె దానవాయిపేట నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతూ స్థానికంగా ఉన్న షాడే బాలికల హాస్టల్‌లో ఉంటోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని, సరిగా చదవడంలేదని ఆ విద్యార్థినిని కళాశాలలో మందలించారు. ఈ నేపథ్యంలో అవమానంగా భావించి హాస్టల్‌కు వచ్చి తెల్లవారు జామున ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది.

2008లో : దానవాయిపేటలోని నారాయణ క్యాంపస్‌లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినితోపాటు మరో విద్యార్థినిని కూడా మార్కులు తక్కువ వస్తున్నాయని తరగతి గదిలో తోటి విద్యార్థులందరి ముందు అసభ్య పదజాలంతో ఉపాధ్యాయులు దూషించారు. కళాశాల భవనం మూడో అంతస్తుకు వచ్చి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

మరిన్ని వార్తలు