లక్షన్నరకు 1,200లే మాఫీ

22 Dec, 2014 06:13 IST|Sakshi

మార్కాపురం: పంటల సాగు కోసం బంగారం తాకట్టుపెట్టి బ్యాంకులో లక్షన్నర రుణం తీసుకుంటే.. కేవలం రూ.1,200 మాత్రమే రుణమాఫీ కావడంతోనూ, అప్పుల బాధ వల్లా మనస్తాపానికి గురైన ప్రకాశం జిల్లాకు చెందిన కౌలు రైతు పిన్నిక అచ్చయ్య (53) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన అచ్చయ్య  అమ్మవారిపల్లెలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి పంటలు వేశాడు.

పెట్టుబడి, ఎరువులు వంటి అవసరాల కోసం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. తెలిసినవారి దగ్గరనుంచి మరో రూ.3 లక్షలు అప్పుతీసుకుని సాగు చేశాడు. అయితే విధి అతనికి సహకరించలేదు. బోర్లలో నీళ్లు రాక పంటలు వాడు ముఖం పట్టడంతో అప్పులెలా తీర్చాలనే దిగులు పెరిగిపోయింది. చంద్రబాబునాయుడు లక్షన్నర లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాననడంతో.. బ్యాంకు రుణమైనా తీరుతుందని ఇన్నాళ్లూ కాస్త ఆశగా ఎదురుచూశాడు.

కానీ రుణమాఫీలో ప్రభుత్వ మాయాజాలానికి ఇతనూ బలైపోయాడు. లక్షన్నర రుణంలో కేవలం రూ.1,200 మాత్రమే మాఫీ కావడాన్ని తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఇంట్లోంచి వెళ్లిన అతను ఆదివారం దరిమడుగు జెడ్పీ హైస్కూల్ సమీపంలో శవమై కన్పించాడు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు