కష్ట‘మే’

14 May, 2019 11:49 IST|Sakshi

మేలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు

నిప్పుల కొలిమిని తలపిస్తున్న జిల్లా

46 డిగ్రీలు దాటిన వైనం

ఇప్పటివరకు ఇదే అత్యధికం

పిట్టల్లా రాలిపోతున్న జనం

జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలు బయటకు రావాలంటే కష్టతర‘మే’ అవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దుపోయినా సెగ తగ్గడం లేదు. ఉక్కపోత ఊపిరాడనీయడం లేదు. వడగాల్పుల ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. చిన్నాపెద్దా తేడాలేకుండా వడదెబ్బబారిన పడుతున్నారు. సరైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవి తాపానికి     తగ్గట్లుగా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

తిరుపతి తుడా: జిల్లా అగ్నిగుండంలా మారింది. ఉదయం నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. 46 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గత ఏడాది మేలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి ఇప్పటికే 46.3 డిగ్రీలు దాటేసింది. పెరుగుతున్న ఎండలతో రాత్రి, పగలు తేడాలేకుండా సెగలు కక్కుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాల్పులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల చివరి కల్లా జిల్లాలో మరింతగా ఎండలు పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా తరుపతి, తిరుపతి రూరల్‌ రామచంద్రాపురం, చంద్రగిరి తదితర తూర్పు మండలాల్లోనే కనిపిస్తోంది.

పిట్టల్లా రాలుతున్న జనం
ఎండవేడిమి, సెగల కారణంగా పలువురు వడదెబ్బబారిన పడుతున్నారు. సరైన చికిత్స అందక పిట్టల్లా రాలిపోతున్నారు. ఏప్రిల్, మేలో ఇప్పటివరకు 83 మంది వడదెబ్బతో మృతిచెందినట్లు అధి కారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య రెట్టింపు     ఉండవచ్చని అంచనా.

దడ పుట్టిస్తున్న ఎండ
ఈ ఏడాది ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచే సెగలు కక్కుతోంది. మార్చిలో 40 డిగ్రీలు దాటేసింది. ఏప్రిల్‌లో 42 డిగ్రీలు నమోదయ్యింది. మే 11న 46.3 డిగ్రీలకు చేరింది. ఇన్నేళ్లలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కావడం విశేషం. బంగాళాఖాతం నుంచి వచ్చే వేడిగాలుల కారణంగా జిల్లాలో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటోంది. దీనికితోడు ఇటీవల భయపెట్టిన ఫొని తుపాను కారణంగా గాలిలో తేమశాతం తగ్గిపోయింది. ఫలితంగా ఎండ వేడిమి పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మాడిపోతున్న జనం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. సెగకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. పేదలు, కూలీలు ఎండబారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పలువురు రోగాలబారినపడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే మిట్టమధ్యాహ్నాన్ని తలపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఎండమావులతో రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మండే ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకు సాహించడం లేదు. రాత్రి వేళల్లోనూ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. తీవ్ర ఉక్కపోతతలో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వెంటాడుతున్న క్షామం
జిల్లాలోని వృక్ష సంపద ఎండలతో మలమలా మాడిపోతోంది. 12 ఏళ్ల నాటి పరిస్థితులు జిల్లాలో మళ్లీ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. అడవులు, నిమ్మ, మామిడి తోటలు వాడుముఖం పడుతున్నాయి. పడమటి మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూర్భ జలాలు రికార్డు స్థాయికి అడుగంటాయి. తాగడానికీ నీళ్లు కరువవుతున్నాయి. గుక్కెడు నీటికోసం మూగజీవాలు పడరాని పాట్లు పడుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

మరిన్ని వార్తలు