టీడీపీలో అన్నదమ్ముల పోరు

21 Apr, 2017 04:06 IST|Sakshi
టీడీపీలో అన్నదమ్ముల పోరు

టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారిన కొండపల్లి బ్రదర్స్‌
ఒకరినొకరు దెబ్బకొట్టుకునే యత్నం
తారాస్థాయికి చేరిన విభేదాలు
⇔  అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పరస్పరం విమర్శలు


కొండపల్లి బ్రదర్స్‌. టీడీపీ వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. రాజకీయంగా దెబ్బకొడుతున్నారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తండ్రి పరువు తీస్తున్నారని ఒకరు, తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మరొకరు బాహాటంగా విమర్శించుకుంటున్నారు. కుటుంబ పోరు కాస్త ఇప్పుడు నియోజకవర్గ పోరుగా మారింది. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో గజపతినగరం తెలుగు తమ్ముళ్లలో అభద్రతా భావం మొదలయ్యింది. కేంద్రబిందువు అవుతున్నారు. ఈయన తీరుతో అటు నాయకుల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ వివాదాస్పదమయ్యారు. మిగతా వారి విషయంలో పక్కన పెట్టి తన సోదరుడైన కొండలరావునూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బకొట్టేలా అంతర్గతంగా యత్నించడం ప్రారంభించారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ఒకప్పుడు కొండపల్లి పైడితల్లినాయుడు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈయన రాజకీయ వారసునిగా రెండో కుమారుడు కొండలరావు తెరపైకి వచ్చినప్పటికీ పెద్దాయన మరణానంతరం మూడో కుమారుడు అప్పలనాయుడు రాజకీయాల్లో ఊపందుకున్నారు. బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనా గత సాధారణ ఎన్నికల్లో గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కొండలరావు ఒక పర్యాయం ఎంపీపీగా పనిచేసి, ఆ తర్వాత పార్టీ పదవులకే పరిమితమయ్యారు. అప్పలనాయుడు పదవి చేపట్టినప్పటి నుంచి అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. అనేక ఆరోపణలకు కేంద్రబిందువు అవుతున్నారు. ఈయన తీరుతో అటు నాయకుల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ వివాదాస్పదమయ్యారు. మిగతా వారి విషయంలో పక్కన పెట్టి తన సోదరుడైన కొండలరావునూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బకొట్టేలా అంతర్గతంగా యత్నించడం ప్రారంభించారు.

పెచ్చుమీరుతున్న విభేదాలు
కొండలరావు బలపడితే నియోజకవర్గంలో తనకు ఇబ్బంది ఎదురవుతుందనో... తనకన్న బలమైన నాయకుడవుతారన్న భయమో తెలియదు గాని ఆయన్ను మొదటినుంచీ అప్పలనాయుడు అణగదొక్కుతున్నారు. భీమసింగి సుగర్‌ ప్యాక్టరీ చైర్మన్‌ పోస్టును ఆయన ఆశిస్తే... వేరొకరికి సిఫార్సు చేశారు. నియోజకవర్గ కేడర్‌ తనవైపే ఉండాలిగానీ... తన అన్నవైపు వెళ్లకూడదని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. తానేం తక్కువ తినలేదన్నట్టు అన్న సైతం తమ్ముడితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

నియోజకవర్గంలో తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకోవడమే కాకుండా తమ్ముడి జోరుకు చెక్‌ పెట్టాలని రాజకీయ ఎత్తుగడలు వేయడం మొదలు పెట్టారు. ఒక అడుగు ముందుకేసి అటు పార్టీకి, ఇటు కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్న అప్పలనాయుడికి మంత్రి, ఇతరత్రా పదవులు ఇవ్వొద్దని నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేనా... తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇవన్నీ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి.

బహిరంగంగానే అన్నపై చిందులు
మూడు రోజుల క్రితం గంట్యాడలో జరిగిన పార్టీ సమావేశంలో అన్న కొండలరావును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే అప్పలనాయుడు అంతెత్తున లేచారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని, రొజుకొక పిటీషన్‌ పెట్టి చెడ్డ చేశారని కార్యకర్తల ముందు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తన పేరు చెప్పుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, రైస్‌ మిల్లు ముసుగులో కోటా బియ్యం తెచ్చి అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారని, విజయనగరంలో మున్సిపల్‌ పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు గుప్పించినట్టు తెలిసింది. ఆయన్ను అరెస్టు చేయిస్తానని... మిల్లు ఎలా నడుపుతారో...విజయనగరంలో హోటల్‌ ఎలా కొనసాగిస్తారో చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చినట్టుగా మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడిది పార్టీలో చర్చనీయాంశమయ్యింది. అన్నదమ్ముల మధ్య పోరులో తాము నలిగిపోయేలా ఉన్నామని కేడర్‌ అంతర్మధనం చెందుతోంది.

 

మరిన్ని వార్తలు