మాత్రలు వికటించి..

9 Feb, 2014 02:32 IST|Sakshi

పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఐరన్ ట్యాబ్లెట్లు వికటించి దాదాపు 30 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడితో పాటు నందిమండలం పీహెచ్‌సీ వైద్యులు పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు.
 
 విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండలం నందిమండలం జిల్లా పరిషత్ ైెహ స్కూల్‌లో శనివారం ఉద యం 11 గంటలకు పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం కేశవ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు తిన్న కొద్ది సేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు కడుపునొప్పితో మరికొందరు వాంతులతో ఇబ్బందులు పడ్డారు.
 
 విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు దగ్గరలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు మహ్మద్ రఫీ, నందిమండలం పీహెచ్‌సీ వైద్యుడు మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు  హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ఇంజెక్షన్‌తో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణం ఇచ్చారు. చెన్నూరు క్లస్టర్ వైద్యుడు ఇబ్రహీం, తహశీల్దార్ వేదనాయకం, వీఆర్వో సాంబశివారెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. తాము ఇంటిదగ్గరే టిఫిన్ చేసినట్లు విద్యార్థులు చెప్పడంతో ఐరన్ మాత్రలు ఇచ్చినట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం కేశవ పేర్కొన్నారు.
 
 ఉదయం ఇవ్వడం వల్లనే...
 పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతి గురువారం భోజనం చేసిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. గురువారం విద్యార్థులు తక్కువగా ఉన్నారని శనివారం ఉదయం 11 గంటలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అన్నం తినకుండా ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
 
 పీహెచ్‌సీ వైద్యుడు మాధవరెడ్డి ఏమంటున్నారంటే...
 విద్యార్థులు అన్నం తిన్న తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఉదయం 11 గంటలకే మాత్రలు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. వైద్యసేవలు అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు.
 
 నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది
 ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన మాత్రలు ఉదయమే ఇచ్చారు. ఇది ముమ్మాటికి నిర్లక్షమే.
 - వెంకటసుబ్బయ్య,
 విద్యార్థి తండ్రి, నంది మండలం
 

మరిన్ని వార్తలు