పోలవరం నిర్వాసితుల సమస్యలపై నివేదిక

12 Apr, 2016 05:31 IST|Sakshi

జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం వెల్లడి

 పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడే రామయ్యపేట గ్రామంలో జాతీయ మానవ  హక్కుల కమిషన్ బృందం సోమవారం పర్యటించింది. కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లా) ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రజబీర్‌సింగ్‌లతో కూడిన బృందం గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి నిర్వాసితుల సమస్యలను నమోదు చేసుకుంది. అనంతరం బృంద సభ్యులు పైడిపాక, చేగొండపల్లి, శింగనపల్లి, మామిడిగొంది, దేవరగొంది నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామం ఖాళీ చేయమంటున్నారని రామయ్యపేట, పైడిపాక గ్రామాలకు  చెందిన  పలువురు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.

అద్దె ఇళ్లల్లోకి వెళ్ళమంటున్నారని, తమ భూములకు 2006, 2007 సంవత్సరాలలో తక్కువ నష్టపరిహారం చెల్లించారని చెప్పారు. 2013 కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులంతా గ్రామాలు ఖాళీ చేసినట్టు, పునరావాస కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసినట్టు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక పంపారని ఆర్థిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. నిర్వాసితులు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని చెప్పారు. వారికి కొత్త భూసేకరణ చట్టం వర్తింప చేయాలని కోరారు. ఈసందర్భంగా బృంద సభ్యుల్లో ఒకరైన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్ కుమార్ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రాయితీలు అన్నీ అందుతాయన్నారు. బృందం వెంట భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్డీవో ఎస్.లవన్న ఉన్నారు.

మరిన్ని వార్తలు