అమ్మ ఇక్కడ.. బిడ్డలు అక్కడ..

29 Jun, 2014 13:36 IST|Sakshi
అమ్మ ఇక్కడ.. బిడ్డలు అక్కడ..

 అమలాపురం టౌన్ : అమ్మ.. నాన్న.. ఇద్దరు చిన్నారి పిల్లలు.. ఓ పండంటి కాపురం వాళ్లది. ఓ చిరువ్యాపారం చేసుకుంటూ ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా ఉంది. నగరం గ్యాస్ పైప్‌లైన్ పేలుడు అగ్నికీలల్లో తల్లి వానరాసి దుర్గాదేవి, ఇద్దరు కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఐదేళ్ల మోహన వెంకట కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. భర్త నరసింహమూర్తి మాత్రం అగ్నికీలల నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ తల్లీబిడ్డలను ఆ రోజు హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పిల్లల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లికి మాత్రం అమలాపురంలోని కిమ్స్‌లోనే వైద్యం అందిస్తున్నారు. రోజూ తనను అంటిపెట్టుకుని నిద్రించే.. ముస్తాబు చేసి స్కూలుకు పంపించే బిడ్డలు అగ్నికీలలకు కళ్లెదుటే గిలగిలలాడి తీవ్రగాయాలపాలవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తాను గాయపడినప్పటికీ వాటిని లెక్కచేయకుండా పిల్లలకోసమే గగ్గోలు పెట్టింది. తీరా ఆస్పత్రికి తరలించాక పిల్లలను మాత్రం తనకు దూరంగా కాకినాడకు పంపేయడంతో ఆమె మనసంతా వారిపైనే ఉంది.

ఎవరు వచ్చినా ‘నన్ను నా పిల్లల దగ్గరకు పంపేయండి.. మా ముగ్గురికీ ఒకేచోట వైద్యం చేయండి’ అంటూ ప్రాధేయపడడం చూపరులను కలిచివేస్తోంది. ‘పిల్లలకు దూరంగా ఎప్పుడూ లేను.. వాళ్లను ఈ స్థితిలో వదిలి ఉండలేను.. ఇలాంటప్పుడు వాళ్లకి దగ్గర ఉంటేనే వారికి గమ్మున తగ్గుతుంది’ అని రోదిస్తోంది. శనివారం సాయంత్రం ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పరామర్శించి ఓదార్చారు.

మరిన్ని వార్తలు