బై.. బై! బాక్సైట్‌

26 Jun, 2019 12:15 IST|Sakshi
చింతపల్లిలో జరిగిన బాక్సైట్‌ వ్యతిరేక సభలో గిరిజనులకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

గిరిజనుల బాక్సైట్‌ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్‌ న్యాయం

బాక్సైట్‌ తవ్వకాల జీవో 97 రద్దుకు ఆదేశం

గిరిపుత్రుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

సాక్షి, అరకులోయ/పాడేరు: తమ బతుకులను నాశనం చేసే బాక్సైజ్‌ తవ్వకాలు వద్దంటూ మన్యం ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా గత పాలకులు పట్టించుకోలేదు. గిరిపుత్రుల గోడును ఆలకించలేదు. టీడీపీ సర్కార్‌ ఏకంగా బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో 97ను సైతం జారీ చేసింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచారు. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాక్సైట్‌ తవ్వకాలకు గుడ్‌బై చెబుతూ..సంబంధిత జీవోను రద్దు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. దీంతో గిరిపుత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. తమకు మంచి రోజులు వచ్చినట్లేనని మురిసిపోతున్నారు.

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అపారమైన బాక్సైట్‌ ఖనిజ సంపదను దోపిడీ చేసేందుకు 1970 నుంచి పాలకులు అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గిరిజనులంతా బాక్సైట్‌ తవ్వకాల చర్యలను నిరసిస్తూ గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.  గిరిజనుల ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా గత పదేళ్ల నుంచి గిరిజనుల పక్షాన నిలిచి బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల  క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్‌కు అనుకూల జీవో నంబర్‌97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ సంబంధిత జీవో 97ను మాత్రం రద్దు చేయలేకపోయింది. దీంతో గిరిజనులు, గిరిజన సంఘాలు ఉద్యమం చేశాయి. జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని పోరుబాట పట్టాయి. వారి పోరాటానికి వైఎస్సార్‌సీపీ అధినేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  ఏజెన్సీలో వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.2015 డిసెంబర్‌ 10వ తేదీన జరిగిన బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమంలో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు.

 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి, గిరిజనులకు మేలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తక్కువ రోజుల్లోనే తమ ప్రభుత్వం గిరిజనుల పక్షాన ఉందని నిరూపించారు. బాక్సైట్‌ తవ్వకాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్‌ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. దీంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనులంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

75 కోట్ల టన్నుల బాక్సైట్‌ నిక్షేపాలు
విశాఖ ఏజెన్సీలోని అరకులోయ మండలం గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్ల, తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తెడు అటవీ ప్రాంతాలలో 75 కోట్ల టన్నుల బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో 27 బాక్సైట్‌ కొండలను గుర్తించారు. ఈ కొండలల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరిపితే 270 గ్రామాల గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లోని అటవీ సంపద అంతా నాశనమవుతుందని, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఏజెన్సీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, పర్యావరణవేత్తలు హెచ్చరించారు.

ఇప్పటికే ఒడిశాలోని దమన్‌జోడి ప్రాంతంలో నాల్కో సంస్థ గత పదేళ్ల నుంచి 48 లక్షల టన్నుల బాక్సైట్‌ ఖనిజ సంపదను తవ్వి తీయడంతో సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగవ్వగా.. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణ వేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని బాక్సైట్‌ ఖనిజ సంపదను తవ్వే చర్యలను తప్పుపట్టారు. గిరిజనులు కూడా ఉద్ధృతంగా పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించింది. బాక్సైట్‌ తవ్వకాల కోసం గత టీడీపీ సర్కార్‌ జారీ చేసిన జీవో 97ను వైఎస్‌ఆర్‌సీపీ సర్కార్‌ రద్దు చేయాలని నిర్ణయించింది.

ఆదివాసీ బిడ్డలను రక్షించే శక్తి జగన్‌
పెందుర్తి: ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల కోసం గత ప్రభుత్వం కుట్రపూరితంగా జారీ చేసిన జీవో నంబర్‌ 97ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు అన్నారు. ఆదివాసీ బిడ్డల జీవీతాలతో పాటు ఏజెన్సీలో పర్యావరణాన్ని రక్షించే శక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్ల విలువైన బాక్సైట్‌ తవ్వకాల కోసం తహతహలాడాయని గుర్తు చేశారు. కానీ ఆదివాసీ బిడ్డలు,  వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాల ఆటలు సాగలేదన్నారు.

తొలినుంచీ బాక్సైట్‌ తవ్వకాల కోసం కుట్ర చేస్తున్న  చంద్రబాబు 2000 మే 24న హైదారాబాద్‌లో నిర్వహించాల్సిన గిరిజన మండలి సమావేశాన్ని విశాఖలో నిర్వహించి ఏజెన్సీలో మైనింగ్‌ ఎవరైనా చేసుకోచ్చన్న తీర్మాణం చేయించడంతో పాటు ఎమ్మెల్యేలందిరితో బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. ఇలాంటి పరిణామాల మధ్యలో ముఖ్యమంత్రి హోదాలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన బాక్సైట్‌ తవ్వకాల జీవో రద్దు ప్రకటన గిరిజన బిడ్డల గుండెల్లో హత్తుకుందన్నారు.

బాక్సైట్‌ జీవో రద్దు ప్రకటన హర్షణీయం
ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం మంచి పరిణామమని ఏయూ తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అన్నారు. గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ నిర్ణయం నిలుస్తోందన్నారు. 2015 నవంబరులో చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను విడుదల చేసిందని..దీని ద్వారా గిరిజన ప్రాంతంలో విలువైన బాక్సైట్‌ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయించారని అన్నారు. దీనిని నాటి నుంచి అనేక మంది గిరిజనులు వ్యతిరేకించారని గుర్తు చేశారు.

ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేసిం దని, ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే 2015 నవంబరు 15న బాక్సైట్‌ వ్యతిరేకంగా ఆదివాసీ శాసన సభ్యులతో సమావేశం పెట్టినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు. జీవోకు వ్యతిరేకంగా తెడబారికి సురేష్‌కుమార్, సుర్ల లోవరాజు ఆమరణ నిరాహార దీక్షలకు సైతం దిగారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ బాక్సైట్‌ జీవోను రద్దుచేస్తానని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సైతం ఆదివాసీల సంరక్షణ, భద్రతకు ప్రభుత్వ పెద్దపీట వేస్తుందని భావిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు