తిరుమల వ్యాపారుల నుంచి ప్రాణహాని

20 Dec, 2017 02:09 IST|Sakshi

     అధిక ధరలపై కేసు వేసినందుకు బెదిరిస్తున్నారు

     హైకోర్టుకు పిటిషనర్‌ మొర

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలలో హోటళ్ల నిర్వాహకులు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ పిటిషన్‌ దాఖలు చేసినందుకు కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నారంటూ డాక్టర్‌ భరద్వాజ చక్రపాణి అనే పిటిషనర్‌ కోర్టుకు మొరపెట్టుకున్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, దీనిపై తిరుపతి పట్టణ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యాజ్యం నుంచి తనను తప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు... పిటిషనర్‌ ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేమిటో వివరించాలంటూ ఎస్పీని ఆదేశించింది. ఒకవేళ నివేదిక ఇవ్వకుంటే స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అధిక ధరలకు విక్రయిస్తున్నారని... 
తిరుమలలో వ్యాపారులు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చంద్రమౌళి వాదనలు వినిపించారు. మీడియాకు చెందిన ఢిల్లీబాబురెడ్డి అనే వ్యక్తితో కలసి కొందరు వ్యాపారులు పిటిషనర్‌ను బెదిరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వ్యాపారుల పేర్లతో సహా తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఢిల్లీబాబురెడ్డి, వ్యాపారుల నుంచి పిటిషనర్‌కు ప్రాణహాని ఉందని వివరించారు. అందువల్ల పిటిషనర్‌ పేరును ఈ వ్యాజ్యం నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌ను బెదిరించేలా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని తేల్చి చెప్పింది. ఈ చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని తెలిపింది. ఈ వ్యాజ్యంలో తిరుపతి పట్టణ ఎస్పీని సుమోటోగా ప్రతివాదిగా చేర్చడంతోపాటు పిటిషనర్‌ ఫిర్యాదు ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

హోటళ్లలో సగానికిపైగా దొంగ లెక్కలే... 
ఈ కేసు గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తిరుమలలోని హోటళ్ల లెక్కలను ఆడిట్‌ చేసినట్లు అమ్మకపు పన్ను అధికారుల తరఫు న్యాయవాది తెలిపారు. ఇందులో సగానికిపైగా దొంగలెక్కలేనని తేలిందంటూ నివేదికను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం... నివేదికను సంబంధిత అధికారులకు పంపి దొంగ లెక్కలు చూపిన హోటళ్ల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వివిధ సమస్యలపై భక్తుల ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధం చేస్తున్న యాప్‌ తయారీ ఎంతవరకు వచ్చిందో వివరించాలని టీటీడీ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు