మూడేళ్ల చిన్నారి సజీవ దహనం

20 Feb, 2016 02:47 IST|Sakshi
మూడేళ్ల చిన్నారి సజీవ దహనం

నంద్యాలటౌన్  నంద్యాల పట్టణం అరుంధతీనగర్‌లో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి చిన్నారి శ్రీవాణి సజీవ దహనమైంది. ఐదు గుడిసెలు దగ్ధమై బాధితులు రోడ్డున పడ్డారు. ఓ గుడిసెలో నివాసం ఉన్న గద్వాల బ్రహ్మయ్య.. మున్సిపాలిటీలోని నాల్గో పారిశుద్ధ్యం డివిజన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య జ్యోతి, 8ఏళ్ల కుమారుడు సాయి, ఆరేళ్ల కుమార్తె సాయిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె శ్రీవాణి, ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు సుబ్బరాయుడు ఉన్నారు. శ్రీవాణి మండ్రాల్ చావిడి వద్ద ఉన్న ప్రైవేటు స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. గురువారం రాత్రి 9గంటలకు భోజనం పూర్తయ్యాక, గుడిసెలో వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రిదాటాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి గుడిసెకు నిప్పంటుకుంది. మంటలు పక్కన ఉన్న నాలుగు గుడిసెలకుకూడా వ్యాపించాయి.

బ్రహ్మయ్య మేల్కొనే సరికి మంటలు, దట్టమైన పొగ వ్యాపించి ఉంది. భార్య జ్యోతిని, కుమారులు సాయి, సుబ్బరాయుడు, శ్రీలక్ష్మిలను ఒకరివెంట మరొకరిని బయటకు పంపి రక్షించాడు. శ్రీవాణి కూడా వీరితో పాటు బయటకు వచ్చిందని అనుకున్నారు. చీకటిలో, దట్టమైన పొగలో, మంటల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి శ్రీవాణి.. బీరువా చాటున వెళ్లి ప్రాణాలను రక్షించుకోవడానికి యత్నించింది. మంటలు వ్యాపించడంతో ఆ బాలిక మృత్యు ఒడికి చేరింది. అగ్ని ప్రమాదం ఘటనా స్థలంలో గందరగోళం నెలకొనడంతో బాలిక ఆర్థనాదాలు ఎవరికీ వినిపించలేదు. మంటలు ఆర్పాక బ్రహ్మయ్య వెళ్లి చూసేసరికి, కాలిపోయిన కుమార్తె శ్రీవాణి కనిపించింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు.
  
 రోడ్డున పడ్డ ఐదు కుటుంబాలు..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గద్వాల బ్రహ్మయ్యతో పాటు గద్వాల చిన్నమ్మ, వీరయ్య, బాలు, పెద్దమాతంగి రమణమ్మల గుడిసెలు కూడా కాలి బూడిదయ్యాయి. ఇంట్లోని తిండి గింజలు, దుస్తులు, వంట సామాగ్రి దగ్ధమయ్యాయి. దీంతో ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సోదరి ఇంట్లో శుభ కార్యం కోసం బ్రహ్మయ్య బీరువాలో దాచిన రూ.లక్ష నోట్ల కట్టలు కాలిపోయాయి. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేశారు. శ్రీవాణి మృతదేహానికి వన్‌టౌన్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ ప్రతాపరెడ్డి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు