ముగ్గురు మిత్రుల విషాదాంతం

20 Oct, 2014 02:56 IST|Sakshi
ముగ్గురు మిత్రుల విషాదాంతం
  • లారీని ఢీకొన్న కారు
  •  డోన్ సమీపంలోని అమకతాడు వద్ద ఘటన
  •  టోల్‌ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్లే కారణం
  •  ఘటనా స్థలిలోనే ముగ్గురి దుర్మరణం
  •  20 రోజుల కూతురిని చూసేందుకు స్నేహితులతో వెళ్తుండగా ప్రమాదం
  •  మృతులంతా చిత్తూరు జిల్లావాసులు
  •  జీవనోపాధికి బెంగళూరులో నివాసం
  • డోన్‌టౌన్/క్రిష్ణగిరి: కర్నూలు జిల్లా డోన్ పోలీసు సర్కిల్ పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన మేరకు.. చిత్తూరు పట్టణానికి చెందిన జగదీష్, అమర్‌నాథ్‌రెడ్డి, రాజేష్ కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జగదీష్ చిత్తూరు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. అమర్‌నాథ్‌రెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ హోటల్ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

    జగదీష్‌కు హైదరాబాద్‌కు చెందిన మీనాకుమారితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 20 రోజుల క్రితం పాప జన్మించడంతో చూసొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అమర్‌నాథ్‌రెడ్డికి చెందిన డస్టర్ కారు(కేఈ 51 ఎండీ 4707)లో రాజేష్‌తో కలసి బయలుదేరారు. డోన్ మండల పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో జగదీష్(35), అమర్‌నాథ్‌రెడ్డి(35), రాజేష్(35) అక్కడికక్కడే మృతిచెందారు.

    టోల్‌గేటు వద్దనున్న స్పీడు బ్రేకర్లే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్లను దాటుతుండగా.. వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడు అమర్‌నాథ్‌రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల తాలూకా మద్దినాయునిపల్లె. నాలుగేళ్ల క్రితం చంద్రగిరికి చెందిన కీర్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇరువురు సంతానం.

    క్యాటరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచిన బెంగళూరుకు చెందిన రాజేష్ మృతితో ఆయన తండ్రి పద్మనాభరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో పెళ్లి చేయాలని భావి స్తున్న తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ డేగల ప్రభాకర్ పరిశీలించారు. టోల్‌ప్లాజా గన్‌మన్ సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు