గౌతమిలో చోరీకి యత్నం, గాలిలో కాల్పులు

27 May, 2014 08:49 IST|Sakshi

నెల్లూరు : దోపిడీ దొంగలు మరోసారి హల్చల్ చేశారు. నెల్లూరు జిల్లా వద్ద రైలు దోపిడీకి విఫలయత్నం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి వద్ద దుండగులు ఈరోజు తెల్లవారుజామున చెన్నై నుంచి గౌహతి వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్లో చైన్ లాగి చోరీకి ప్రయత్నించారు. ఎస్-6 బోగీలోని ప్రయాణికుల్ని బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించగా వారు ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు పెట్టారు.

దాంతో పక్క బోగీలో ఉన్న రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరిపటంతో వారు రైలు దూకి పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. చెన్నైకి చెందిన దొంగల ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తుండటంతో దొంగలు రెచ్చిపోతున్నారు.

దొంగల భయంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా సోమవారం కూడా ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులను బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. సింహపురి, శేషాద్రి, యశ్వంతపూర్ రైళ్లలో దోపిడీ విఫలయత్నం చేశారు.
 

మరిన్ని వార్తలు