ముగిసిన ఎన్నికల  వనవాసం

9 Jul, 2019 06:40 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పక్క జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు తిరిగి తమ పూర్వ స్థానాలకు చేరుకున్నారు. నాలుగు నెలల క్రితం జిల్లాలోని తహసీల్దార్లను, మండల అభివృద్ధి అధికారులను జోనల్‌ పరిధిలో గల విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు బదిలీ చేశారు. వారు  తిరిగి సోమవారం నాటికి సొంత జిల్లాకు చేరుకున్నారు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చారు. వారు కూడా ఒకటి రెండు రోజుల్లో వారి జిల్లాలకు వెళ్లనున్నారు.  

41 మంది తహసీల్దార్లు జిల్లాకు రాక
సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వెళ్లిన 41 మంది తహసీల్దార్లు జిల్లాకు చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ జిల్లాలో వివిధ మండలాలు, ఆర్‌డీఓ కార్యాలయంలో పోస్టింగులు ఇవ్వాల్సివుంది. మన జిల్లాలో ఎన్నికల విధుల్లో గత నాలుగు నెలలుగా ఉన్న 41మంది తహసీల్దార్లు కూడా వారి స్వంత జిల్లాలకు వెళ్లనున్నారు. మన జిల్లాకు విజయనగరం నుంచి 13, విశాఖపట్నం నుంచి 28 మంది తహసీల్దార్లు వెనక్కు వచ్చారు. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సివుంది. 

శ్రీకాకుళం డివిజన్‌కు తహసీల్దార్ల కొరత
తహసీల్దార్లు వెనక్కు వచ్చినా శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్‌ పరిధిలో కొరత అలాగే ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవిన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చిన దృష్ట్యా  స్వంత రెవిన్యూ డివిజన్‌లో వారికి పోస్టింగ్‌ ఇవ్వరాదని జీవోను విడుదల చేసింది. ఈ జీవో మంచిదే అయినప్పటికీ, అంత పెద్ద మొత్తంలో తహసీల్దార్లు లేదు,  జిల్లాలో ఉన్న 41 మంది తహసీల్దార్లలో ఇతర రెవిన్యూ డివిజన్లకు చెందిన వారు 8మంది మాత్రమే ఉన్నారు. ఇతర జిల్లాకు చెంది ఈ జిల్లాలో ఉండాలని కోరుకున్న వారు మరో ముగ్గురు ఉన్నారు. అంటే 11 మంది తహసీల్దార్లు అందుబాటులో ఉన్నారు.

వాస్తవానికి శ్రీకాకుళం రెవిన్యూ విడిజన్‌ పరిధిలో 13 మండలాలకు 13 మంది తహసీల్దార్లు ఉండాలి, అలాగే శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయంలో కూడా ఇద్దరు ఉండాలి. అలా ఇతర శాఖల్లో కూడా అంటే ఎపీఈపీడీసీఎల్, ఎస్సీ కార్పొరేషన్, డ్వామా, డీఆర్‌డీఎ, సాంఘిక సంక్షేమ శాఖ, ఇలా పలు శాఖల్లో తహసీల్దార్ల అవసరం ఉంది. రెవిన్యూ డివిజన్‌లో స్థానికులకు తహసీల్దారు పోస్టింగ్‌ ఇవ్వరాదని నిబంధనల వలన ఈ సమస్య వచ్చింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వెసులుబాటు  ఇస్తే తప్ప తహసీలార్ల కొరత తీరే అవకాశం లేదు. 

సీనియర్‌ ఎంపీడీవోలు ఉండాలి
స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మండల అభివృద్ధి్ద కార్యాలయాల్లో సీనియర్‌ ఎంపీడీవోలు ఉండాల్సిన అవసరముంది. అభివృద్ధి, నవరత్నాల అమలు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండల అభివృద్ధి అధికారులు అనుభవజ్నులై ఉండాలి. జిల్లాలో ఉన్న సీనియర్‌ ఎంపీడీవోలు ఎక్కువ మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఫారిన్‌ సర్వీసుల్లో డెçప్యుటేషన్‌లో ఉన్నారు. ఈసారి పోస్టింగ్‌ ఇచ్చేటప్పుడు మండలాలకు సీనియర్‌ ఎపీడీవోలకు పోస్టింగ్‌ కల్పిస్తే, నవరత్నాల అమలు సజావుగా సాగుతోందని సీనియర్లు చెపుతున్నారు.   

మరిన్ని వార్తలు