అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య!

24 Mar, 2017 09:44 IST|Sakshi
అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య!

ఒంగోలు: అమెరికాలో జాత్యాహంకార ఉన్మాది కాల్పులలో మరణించిన తెలుగు ఇంజినీర్  కూచిబొట్ల శ్రీనివాస్‌ ఉదంతం మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరు తెలుగువారు దారుణహత్యకు గురయ్యారు. మృతులు ప్రకాశం జిల్లా పర్చురు మండలం తిమ్మరాజుపాలెం వాసులు. న్యూజెర్సీలోని బర్లింగ్టన్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్‌ సాయి (7) హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దర్ని గొంతు కోసి  ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. శశికళ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.  వీరికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. శశికళ బుధవారం సాయంత్రం  బాబును స్కూల్‌ నుంచి తీసుకొచ్చారు.

అయితే, సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడిఉన్నారు. వారిని గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించిన ఆయన... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే... అమెరికాలోని తానా ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. కాగా ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.