సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు

22 Nov, 2019 05:32 IST|Sakshi

యూనిసెఫ్‌ మరింత తోడ్పాటునందించాలి: సీఎస్‌ నీలం సాహ్ని

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోరారు. ఈ విషయంలో యూనిసెఫ్‌ కూడా మరింత సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. యూనిసెఫ్‌ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్యం, పాఠశాల విద్య, గ్రామీణ రక్షిత నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సీఎస్‌ గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటోందని సీఎస్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత నివారించేందుకు, బాలికల్లో డ్రాపవుట్‌ రేట్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి యూనిసెఫ్‌ కూడా తోడ్పాటును అందించాలని కోరారు. సమావేశంలో యూనిసెఫ్‌ ప్రతినిధి మైటల్‌ రుష్డియా, స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రాంత గృహనిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) అర్బన్‌ కింద వివిధ పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహనిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన పీఎంఏవైకి సంబంధించి రాష్ట్ర స్థాయి మంజూరు, పర్యవేక్షణ(శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌) కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఏపీ టిడ్కో(ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఎండీ దివాన్‌ మైదీన్‌ ఇళ్ల నిర్మాణాల పురోగతి గురించి సీఎస్‌కు వివరించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ, ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ పట్టణాభివృద్ధి సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నూతన డీపీఆర్‌ల కింద రెండు లక్షల 58 వేల గృహాలకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వాటిని కేంద్రానికి పంపేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు.

మరిన్ని వార్తలు