హరి హరీ.. మరో అపకీర్తి!

4 Jul, 2018 11:33 IST|Sakshi
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న నానుడి ఉంది. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో అలాగే జరిగింది. లక్ష తులసి పూజ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం సింహగిరికి వచ్చిన ఓ భక్తుడికి భంగపాటు ఎదురైంది. ఈ రోజు లక్ష తులసి పూజ రద్దు చేశామని, పూజ చేసే అర్చకులు పలువురు సెలవులో ఉన్నారన్న సమాధానంతో భక్తుడు నోటిమాట రాలేదు. ఇదేంటని గట్టిగా ప్రశ్నించడంతో ఆలయ అధికారులు, అర్చకులు (కొందరు) ఆ భక్తుడ్ని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్దిచెప్పి అష్టోత్తర పూజ చేసి పంపించాల్సి వచ్చింది. దేవస్థానం అధికారులు..అర్చకుల మధ్య  సమన్వయ లోపం, నిర్లక్ష్యంగా అప్పన్న సాక్షిగా బయటపడింది. ఇటీవల కాలంలో తరచూ సింహాచలం దేవస్థానంలో ఇటువంటి అపకీర్తులు 
చోటుచేసుకుటున్నాయి.

సింహాచలం(పెందుర్తి): రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఆర్జిత సేవలు(నగదు చెల్లించి జరిపించుకునేవి)లో లక్ష తులసిపూజ ఒకటి. ఈ పూజను ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి జరుపుతారు. ఈ పూజలో పాల్గొనే భక్తుడు దేవస్థానానికి రూ.2500 చెల్లించి టిక్కెట్టు పొందాల్సి ఉంటుంది. స్వయంగా సింహగిరికి వచ్చికాని, ఇంటర్నెట్‌లోగాని సంబంధిత టిక్కెట్టును కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పూజను జరిపించేందుకు స్వామివారి సహస్రం చదివే పదిమంది వరకు అర్చకులు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో అర్చకుడు పదేసిసార్లు ఒక సహస్రాన్ని చదవాలి. అలా ఈ మంగళవారం లక్షతులసి పూజను జరిపించుకునేందుకు గత నెల 26వ తేదీన ఒడిశాకు చెందిన శరత్‌రెడ్డి టిక్కెట్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో పూజాసామగ్రి, పండ్లు ఇతర ద్రవ్యాలతో పూజకు హాజరయ్యాడు. ఆలయంలో అడుగుపెట్టగానే అర్చకులు, అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో కంగుతిన్నాడు. పూజ చేసేందుకు సరిపడా అర్చకులు లేరంటూ అతన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఇదేంటని శరత్‌ గట్టిగా ప్రశ్నించేసరికి ఆలయ అర్చకులకు, అధికారులకు ఏం మాట్లాడాలో తెలియరాలేదు. చివరికి అతనికి నచ్చజెప్పి, స్వామివారి అష్టోత్తర పూజచేసి పంపించారు.

నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో
ఆలయంలో అర్చకులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో స్పష్టంగా బయటపడింది. ఆలయంలో ఇద్దరు ఇన్‌చార్జి ప్రధానార్చకులు, ఒక ఉప ప్రధానార్చకుడు, ఎనిమిదిమంది ముఖ్య అర్చకులు, 12 మంది అర్చకులు, 5గురు పరిచారకులతో కలిపి 28మంది వరకు స్వామివారి సేవల్లో ఉన్నారు. వీరిలో పలువురు ఆయా షిఫ్టుల్లో స్వామికి సేవలందిస్తుంటారు. అలాగే ముగ్గురు సూపరింటిండెంట్లు, ఒక ఏఈవో, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆయా షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో చాలామంది ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఇటీవల కోకొల్లలు. మంగళవారం ఆరుగురు అర్చకులు సెలవులపై వెళ్లడం, ఆలయంలో కేవలం పదిమంది మాత్రమే అర్చకులు డ్యూటీలో ఉండడం గమనార్హం. ఉదయం లక్ష తులసిపూజ ఉందని కూడా తెలిసి ఎలా అంతమంది అర్చకులు సెలవు పెట్టారో...ఒకవేళ వాళ్లు శెలవు పెట్టినా పూజ సమయానికి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై అటు వైదిక అధికారులను, ఇటు ఆలయ అధికారులను భక్తులు విమర్శిస్తున్నారు.

ముందే తెలిసినా ఇవ్వని సమాచారం
ఇదిలా ఉండగా మంగళవారం ఆలయంలో జరిగే లక్ష తులసిపూజకు తగినంత మంది అర్చకులు లేరని, కొందరు శెలవులపై వెళ్లారని ఆలయ అ«ధికారులకు సోమవారం సాయంత్రానికే తెలిసింది. దీంతో లక్ష తులసి పూజ రద్దు చేయమని చెప్పేశారు. ఈ తరుణంలోనే సింహగిరిపై ఉన్న చిన్నదాసుడుకు (ఈయన కూడా లక్ష తులసిపూజ జరిపించుకోవాల్సి ఉంది) పూజ లేని సమాచారాన్ని అందించారు. కానీ గత నెల 26వ తేదీన ఎంఆర్‌ రశీదు తీసుకున్న శరత్‌రెడ్డికి మాత్రం సమాచారం అందించలేదు.

జరిగిన సంఘటనపై ఆలయ 
సూపరింటిండెంట్‌ తయారుచేసిన రిపోర్టు

పూజ రద్దు చేయమని ఏఈవో చెప్పారు
ఆలయంలో విధులు నిర్వర్తించే కొందరు అర్చకులు పెళ్లిళ్లు తదితర కారణాలతో శెలవులు పెట్టడంతో మంగళవారం లక్ష తులసిపూజ రద్దు చేయాలని ఏఈవో చెప్పారు. అధికారి ఇష్ట్రపకారంగా మేం చేయాల్సి వచ్చింది. మాకు ఎలాంటి పవర్స్‌ లేవు. చెప్పడం వరకే మా వంతు. కనీసం పదిమంది అర్చకులు లక్ష తులసిపూజకు అవసరం ఉంటుంది. ఉదయం లక్ష తులసిపూజకు వచ్చిన భక్తుడికి అష్టోత్తర పూజ చేయించి పంపించాం.
గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఇన్‌చార్జి ప్రధానార్చకులు 

మరిన్ని వార్తలు