దొంగ పోలీసులు!

13 Oct, 2013 02:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఇద్దరు పోలీసు అధికారులు వీరప్పన్ అవతారం ఎత్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమ రవాణాతో కొల్లగొట్టిన సొమ్మును పంచుకుతింటున్నారు. ఎర్రచందనం దుంగల వాహనాలకు ఓ పోలీసు అధికారి పైలట్‌గా వ్యవహరిస్తే.. మరో అధికారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను తలకెత్తుకున్నారు.
 
 నిఘా వర్గాల విచారణలో ఇద్దరు ఎస్సైల అక్రమాల దందా బహిర్గతమవడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఎర్రచందనం దుంగలు విస్తారంగా లభిస్తోన్న విషయం విదితమే.
 
 తమిళనాడు, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు కూలీలను పెట్టి.. ఎర్రచందనం దుంగలను నరికించి, అక్రమ రవాణా చేస్తోన్న విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నిఘా పెరగడంతో స్మగ్లర్లు వ్యూహం మార్చారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను అనంతపురం జిల్లా గుండా బెంగళూరుకు తరలించి, కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో కదిరి రేంజ్‌లోని ఓ అటవీ శాఖ అధికారి తొలుత స్మగ్లర్లతో చేతులు కలిపారు.

చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను కదిరి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో ఆ అధికారి సహకారంతో దాచి.. గుట్టుగా బెంగళూరుకు తరలించేవారు. ఇది గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఏడాది క్రితం కదిరి పరిసర ప్రాంతాల్లోని అడువుల్లో నిర్వహించిన దాడుల్లో అటవీ శాఖ అధికారి దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు తమదైన శైలిలో విచారించడంతో ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది.
 
 కదిరి పరిసర ప్రాంతాల్లో దాచిన ఎర్రచందనం దుంగలను కదిరి, ఓడీసీ, గోరంట్ల మీదుగా కర్ణాటక సరిహద్దుల్లోకి చేర్చి.. బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో అటవీ శాఖ అధికారి అంగీకరించారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వాహనానికి ఆ ప్రాంతంలో పనిచేస్తోన్న ఓ ఎస్సై తన వాహనంలో పైలట్‌గా వ్యవహరిస్తారని విజిలెన్స్ అధికారులకు చెప్పారు. ఇదే అంశాన్ని అప్పట్లో విజిలెన్స్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడంతో.. ఆ ఎస్సైపై బదిలీ వేటుతో సరిపుచ్చుకున్నారు.
 
 కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఇటీవల కదిరి ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించిన అధికారి ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్‌గా అవతారం ఎత్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నల్లమల అడవుల్లో పర్యటించి.. ఎర్రచందనం వృక్షాలను గుర్తిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రదేశాలకు కూలీలను పంపి.. వాటిని నరికించి, కదిరి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోకి చేర్చుతున్నారు.
 
 ఆ తర్వాత వాటిని బెంగళూరుకు ఆ పోలీసు అధికారే చేర్చుతున్నారు. ఈ పోలీసు అధికారికి గతంలో ఈ ప్రాంతంలో పని చేసి, బదిలీ అయిన ఎస్సై సహకారం అందిస్తున్నారు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు చేర వేశాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్సైల వ్యవహార శైలిపై సమగ్ర విచారణ చేశారు. ఇద్దరు ఎస్సైల అక్రమాల దందా ఉన్నతాధికారుల విచారణలో బహిర్గతమైంది.
 
 ఆ ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఉపక్రమించిన సందర్భంలోనే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. దాంతో.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం నేపథ్యంలో ఆ ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకుంటే.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వెనక్కుతగ్గారు. ఇదే అలుసుగా తీసుకున్న ఆ ఇద్దరు ఎస్సైలు ఇటీవల మరింత రెచ్చిపోతుండటంతో ఉన్నతాధికారులు ఆగ్రహించారు. ఇద్దరిపై సస్సెన్షన్ వేటు వేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడటం ఖాయమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 

మరిన్ని వార్తలు