వీరశైవుల భక్తికి నిదర్శనం శూలాల ఉత్సవం

2 Nov, 2014 01:45 IST|Sakshi
వీరశైవుల భక్తికి నిదర్శనం శూలాల ఉత్సవం
  •  రేపు మునగపాకలో సంబరం
  • మునగపాక: ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే పేరెన్నిక గన్న మునగపాక శూలాల మహోత్సవం ఈ నెల 3న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ బూడిద శ్రీనివాసరావు తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు ఇక్కడకు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.  ఏటా కార్తీకమాసం రెండో సోమవారం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
     
    ఉత్సవ ప్రత్యేకత

    ఇక్కడి దేవాంగుల కులానికి చెందిన వారు వ్యాపార నిమిత్తం తమిళనాడు రాష్ట్రం పళిని పట్టణాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ వీరశైవులు శూలాలు ధరించి  డప్పు వాయిద్యాలకు అనుగుణంగా  నృత్యం చేయడం వీరిని ఎంతగానో ఆకర్షించింది. అదేవిధంగా మునగపాకలో కూడా నిర్వహించాలనుకున్నారు. సుమారు వందేళ్ల నుంచి మునగపాకలో క్రమం తప్పకుండా శరీరం, నాలుక, బుగ్గలపై శూలాలు ధరించి నృత్యం చేస్తూ వస్తున్నారు.  అప్పట్లో ఈ వేడుక ఒక వీధికి మాత్రమే పరిమితమై ఉండేది. క్రమేణా గ్రామస్తులంతా ఒకటై కులమతాలకు అతీతంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.  
     
    ప్రత్యేక ఆకర్షణగా శూలాల నృత్యం

    ఈ వేడుకల్లో శివ భక్తులు ప్రదర్శించే ఇనుప శూలాల నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. కార్తీక మాసం రెండో సోమవారం శూలాలు ధరించే భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి శరీరం, బుగ్గలు, నాలుకపై ఇనుప చువ్వలు గుచ్చుకొని చువ్వల చివరన ఉండే నూలు కండెలను వెలిగించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు.  నృత్య ప్రదర్శన గ్రామంలోని అన్ని వీధులగుండా ఊరేగింపుగా వచ్చి  ఉదయం 5  గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది. ఈ నృత్యాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉంటారు.
     
    ఆకర్షణీయంగా రెండతస్తుల గుమ్మటం

    ఈ ఉత్సవానికి మరో ఆకర్షణగా రెండతస్తుల గుమ్మటం నిలుస్తుంది. ఏటా ఉత్సవానికి నెలరోజుల ముందు నుంచి గుమ్మటం తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగురంగుల నూలుదారాలతో సుమారు 15 అడుగుల ఎత్తులో ఈ గుమ్మటాన్ని తయారు చేస్తారు. గుమ్మటంలో శివుని ఫొటో  ఉంచి పురవీధుల్లో భక్తుల దర్శనార్ధం  ఊరేగింపు నిర్వహిస్తారు. గుమ్మటం కింద భాగాన్ని నుదిటితో భక్తులు హత్తుకుంటారు. దీనివల్ల కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం.    గ్రామంలోని అన్ని వీధులను కలుపుకొని భారీ విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సందర్శనార్థం సోమవారం తెల్లవారు నుండి ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
     
    సాంస్కృతిక కార్యక్రమాలు

    ఉత్సవంలో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు ఏర్పాటు చేస్తున్నారు. చిడతలు, కోలాటాలు, భజనలు, కొయ్య డ్యాన్స్‌లు, తప్పిటగుళ్ల వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.  ఉత్సవ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునగపాక ఎస్‌ఐ జి. రవికుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు