దినదిన గండం

2 Jun, 2019 13:17 IST|Sakshi

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాలతో పాటు గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరి నదిలో పలుచోట్ల అడ్డుకట్టలు వేయడమే ఇందుకు కారణం. ఈ ఏడాది వరదొస్తే తమ పరిస్థితి ఏంటని 19 నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిమట్టం పెరిగిందని, స్టోరేజ్‌ ఉందని నిర్వాసితులు చెబుతున్నారు.

ప్రహసనం.. పునరావాసం : 2019 జూన్‌ నాటికి కాఫర్‌డ్యామ్‌ నిర్మించి గ్రా విటీ ద్వారా నీటిని విడుదల చేస్తామని, నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ పనులు పూర్తికాలే దు. అలాగే స్పిల్‌వే పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. పోలవరం మండలంలో రెండో విడత 19 గ్రామాల్లో 3,300 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. వీరికి ఇప్పటివరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు కాలేదు.

పునరావాస గ్రామాల్లో నిర్వాసితులకు గృహనిర్మాణాలు పూర్తి కాలేదు. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం మండలాల్లో గృహనిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జూన్‌ నాటికి గృహనిర్మాణాలు పూర్తిచేసి నిర్వాసితులను తరలించకపోవడంతో పాత గ్రామాల్లోనే నిర్వాసితులు ఉంటున్నారు. వరదలు వస్తే ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం వరద ముంపునకు గురవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి పోలవరం రావాలంటే తా మంతా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

మార్గాలున్నాయి
వరదలు వచ్చినా కాఫర్‌డ్యామ్‌ పైనుంచి దిగువకు యథావిధిగా వరదనీరు వెళుతుందని, మరోవైపు స్పిల్‌వే మీదుగా కూడా వరదనీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు నీరు దిగువకు వెళ్లిపోవడం వల్ల పెద్దగా ముంపు ఉండే అవకాశాలు తక్కువ అని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 

రాకపోకలకూ ఇబ్బందే..
వరదలు వస్తే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల ఎగువన ఉన్న చీడూరు గ్రామం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంది. మా ఊరికి చెందిన నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయలేదు. వరదలు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోడ్డు మార్గం పూర్తిగా వరద ముంపునకు గురవుతుంది. రాకపోకలు సాగే పరిస్థితి ఉండదు. దీంతో ఇబ్బందులు తప్పవు. – మామిడి సురేష్‌రెడ్డి, చీడూరు

గోదావరి నీటి మట్టం పెరిగింది
జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. గోదావరికి వరదల సమయం వచ్చేసింది. వరదలు వస్తే మా గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయం వెంటాడుతోంది. మా గ్రామాలకు రోడ్డు మార్గాలు కూడా ఉండవు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం కూడా పెరిగింది.   – ఇండెల రామ్‌గోపాల్‌రెడ్డి, కొరుటూరు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా