విషజ్వరాలతో విలవిల!

5 Oct, 2018 03:30 IST|Sakshi
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో విషజ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులు

రాష్ట్రంలో విస్తృతమవుతున్న మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ కేసులు  

15 ముఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో సెప్టెంబర్‌లో మృతుల సంఖ్య 1,853

రోజుకు సగటున 62 మంది బలి

గుంటూరు, కృష్ణా, తూ.గో, విశాఖ, కర్నూలు జిల్లాల్లో అత్యధిక మరణాలు

విష జ్వరాలతో ప్రతి ఆస్పత్రిలోనూ బారులు తీరుతున్న బాధితులు

వర్షాలు, అధ్వాన్న పారిశుధ్యంతో జ్వరాల విజృంభణ

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రాన్ని వైరల్‌ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది.

సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్‌ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు.

సమన్వయలోపం.. బాధితులకు శాపం
వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి.

కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’
దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది.

జిల్లాల్లో పరిస్థితి ఘోరం
♦  శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్‌ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్‌లోనే 51మంది బలయ్యారు.
♦  విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
♦  విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్‌కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్‌లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు.

కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా
♦  తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు.
కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు.
గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్‌లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి.
ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు.
♦  శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్‌లోనే  సెప్టెంబరులో 88మంది మరణించారు.  

రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే
♦  వైఎస్సార్‌ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్‌లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు.
♦  అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్‌సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్‌లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు.
♦  కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్‌లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి.
♦  తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు.


గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు..
ఆస్పత్రి                            మృతుల సంఖ్య
జీజీహెచ్, గుంటూరు                  293
జీజీహెచ్, కాకినాడ                    277
కేజీహెచ్, విశాఖపట్నం              224
జీజీహెచ్, విజయవాడ               210
జీజీహెచ్, కర్నూలు                  147
రుయా, తిరుపతి                        99
జీజీహెచ్, అనంతపురం               98
జీజీహెచ్, నెల్లూరు                      88
డీహెచ్, రాజమండ్రి                     83
రిమ్స్, కడప                             77
డీహెచ్, ఏలూరు                        56
రిమ్స్, ఒంగోలు                         56
డీహెచ్, మచిలీపట్నం                53
రిమ్స్, శ్రీకాకుళం                       51
డీహెచ్, విజయనగరం                41

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు