మనసున్న మారాజు | Sakshi
Sakshi News home page

మనసున్న మారాజు

Published Fri, Oct 5 2018 3:18 AM

Peoples about ys jagan mohan reddy in praja sankalpa yatra - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజల కష్టాలు తెలుసుకుని.. వారి కన్నీళ్లు తుడిచి వారి సంక్షేమానికి నిత్యం పాటుబడేవాడే నిజమైన నాయకుడు. అలాంటి వారి పాలనలోనే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు అలాంటి రామరాజ్యం వస్తుందనే విషయం ప్రజా సంకల్ప యాత్రలో స్పష్టమవుతోంది. జగన్‌ను చూడటానికి వచ్చిన ఓ చిన్నారి కాలి చెప్పు పోవడంతో ఆమె కాలిని తన కాలిపై పెట్టుకుని మండుటెండలో నిలబడ్డారు జగన్‌. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి ఆటోలో వెళ్లడానికి తన సభ అవరోధం కాకూడదని దారిచ్చి క్షేమంగా పంపించేలా శ్రద్ధ తీసుకున్న ఆయన చొరవకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వద్దు తల్లీ కాళ్లు కాలిపోతాయ్‌..
వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో జనం వేలాదిగా తరలివచ్చి ఆయన అడుగులో అడుగులేస్తున్నారు. అంతటి జనసమ్మర్థంలోనూ చిన్నారులు, వృద్ధుల విషయంలో ఎంతో జాగరూకత ప్రదర్శిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు జగన్‌. గత నెల 30వ తేదీన ప్రజా సంకల్ప యాత్రలో గంట్యాడ మండలం చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మలు తమ పిల్లలతో కలిసి పాత భీమసింగి జంక్షన్‌ నుంచి బలరామపురం, కుమరాం మధ్యలో జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎండ ప్రచండంగా ఉంది. జనం పోటెత్తడంతో రమణమ్మ కుమార్తె పదమూడేళ్ల సంగీత చెప్పు జారిపోయింది. అయినా ఫరవాలేదంటూ నడిచేస్తానంది.

‘వద్దు తల్లీ కాళ్లు కాలిపోతాయి’ అని జగన్‌ వారించారు. అయినా ఆమె వినకుండా నడుస్తా.. ఏం కాదు అని నడవబోగా, కాళ్లు కాలిపోతాయమ్మా.. అంటూ ఆమె పాదాన్ని తన కాలిపై ఉంచి నిలబడమన్నారు జగన్‌. ఆ చిన్నారి సంశయిస్తుంటే.. జగన్‌ ఆ చిన్నారి కాలిని తన పాదాలపై ఉంచి చెప్పు ఎక్కడ పడిపోయిందో చెప్పమ్మా.. అని తెలుసుకుని దానిని తీసుకు రావాలని తన భద్రతా సిబ్బందికి చెప్పారు. వారు వెనక్కి వెళ్లి వెతికి.. కాసేపటికి చెప్పును తీసుకొచ్చారు. అప్పటి వరకూ ఆ చిన్నారి పాదం జగన్‌ కాలిపైనే ఉంది. సంగీతకు చెప్పులు తొడిగించి పాదయాత్రను కొనసాగించారు.  

అన్నా.. ఆటోకు దారివ్వండన్నా..
ఇలాంటిదే మరో సంఘటన ఈ నెల 3వ తేదీన నెల్లిమర్ల బహిరంగ సభలో జరిగింది. జననేత ఉద్విగ్నభరితంగా ప్రసంగిస్తుండగా అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం ఆనందపురం గ్రామానికి చెందిన గర్భిణి యాల రాజేశ్వరి ఆటోలో ఆ దారి నుంచే వెళ్లాల్సి వచ్చింది. జనం మధ్యలోంచి ఆటో వెళ్లలేకపోవడాన్ని వేదిక నుంచే గమనించిన జగన్‌.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేశారు. నిండు చూలాలి బాధను చూసి చలించిపోయారు.

‘108 రాకపోవడంతో ఆ గర్భిణి ఆటోలో వెళ్తోంది. కొంచెం దారివ్వాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా. అన్నా.. ఆటోకు  దారివ్వండన్నా’.. అంటూ పదే పదే మైక్‌లో చెప్పారు. జననేత అభ్యర్థనతో అప్పటి వరకూ ఆయన ప్రసంగం వింటూ వేలాదిగా గుమిగూడిన అభిమానులు సైనికుల్లా క్రమశిక్షణతో పక్కకు జరిగారు. కొందరు రక్షణ వలయంగా ఏర్పడి ఆటోను ముందుకు నడిపించారు. ఆ క్షణంలో జగన్‌ మాట్లాడుతూ ‘ఇదే నెల్లిమర్లలో ఇప్పుడు గర్భిణీ ఆటోలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే.., 108కి ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో కుయ్‌.. కుయ్‌ మంటూ రావాల్సిన అంబులెన్స్‌ సౌండ్‌ వినపడటం లేదంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో వేరే చెప్పక్కర్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

జగనన్న చేసిన మేలును మరువలేం
ఆ జనాన్ని దాటుకుంటూ వెళ్లగలమా? సాయం చేసేదెవరని భయంతో ఉన్న ఆ గర్భిణి కుటుంబ సభ్యులు ఆ క్షణం ఆటోలోంచే.. జననేతకు అభివాదం చేశారు. ‘మా పరిస్థితిని గమనించిన జగనన్న స్వయంగా కల్పించుకుని, మా ఆటోకు దారివ్వాల్సిందిగా అక్కడున్నవారందరినీ కోరారు. మైకులో ఆయన చెబుతుంటే అంత భారీ సంఖ్యలో ఉన్న జనం ఒక్కసారిగా బాట ఏర్పరిచారు. పక్కకు జరిగి మా ఆటోకు దారిచ్చారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాం.

జగనన్న చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను’ అంటూ ఆ నిండు చూలాలు రాజేశ్వరి కృతజ్ఞతా భావంతో తెలిపింది. ఈ రెండు ఘటనలే కాదు.. పాదయాత్రలో జగన్‌ ఇలాంటి ఎన్నో ఉదంతాల ద్వారా తనలోని మానవత్వాన్ని చాటుతున్నారు. తనను చూడాలనే ఆరాటంలో వృద్ధులు, పిల్లలు కింద పడిపోతుంటే ఆయనే స్వయంగా వారిని రక్షిస్తున్నారు. ఊడిపోయిన వారి చెప్పులు చేతితో పట్టుకునిమరీ వారి కాలికి తొడుగుతున్నారు. లేచి నిలబడలేని వారు ఎదురైతే.. ఆయనే వారి వద్ద నేలపై కూర్చొని పలకరించి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న వారిని గమనిస్తూ.. వారికి ఏ కష్టం కలుగకుండా చూసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement