గుంటూరులో శీతాకాల అసెంబ్లీ?

17 Nov, 2014 01:34 IST|Sakshi
గుంటూరులో శీతాకాల అసెంబ్లీ?

ప్రభుత్వంతో చర్చించాక సమావేశాలపై నిర్ణయం: స్పీకర్ కోడెల
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలను గుంటూరు జిల్లాలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమావేశ మందిరంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం నాగార్జున వర్సిటీని సందర్శించనున్నారు. అక్కడ ఉన్న డైక్‌మన్ హాలును ఇతర భవనాలను పరిశీలించనున్నారు. ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర అసెంబ్లీకి హైదరాబాద్‌లోని ప్రస్తుత శాసనసభ ప్రాంగణంలో ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. విభజన అనంతరం తొలి సమావేశాలు, ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు ఈ పాత అసెంబ్లీ భవనంలోనే జరిగాయి. 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీ నిర్వహణకు ఈ పాత అసెంబ్లీ భవనం ఏమాత్రం సరిపోవడం లేదు. సీఎం, మంత్రులకు, ప్రతిపక్ష నేతలకు చాంబర్ల ఏర్పాటుకు సరైన గదులు లేవు.  వీటన్నిటికన్నా రాష్ట్రం ఒకచోట ఉండగా అసెంబ్లీ మరోచోట జరుగుతుండడంతో సమావేశాల ప్రాధాన్యత పెరగడం లేదు. అప్పట్లోనే ్ల సమావేశాలను ఏపీలో నిర్వహిస్తే బాగుంటుందని స్పీకర్ కోడెల ఆలోచన చేశారు. ఈ మేరకే ఆయన సోమవారం నాగార్జున వర్సిటీలోని భవనాలను పరిశీలిస్తున్నారు. సమావేశాలు పది రోజులు జరిగే అవకాశముండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లకు అనుకూల వాతావరణం, 175 మంది ఎమ్మెల్యేలతో పాటు అధికారులకు వసతులు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను స్పీకర్ పరిశీలించనున్నారు.
 
 గుంటూరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరపాలని తుది నిర్ణయం తీసుకోలేదని, ఇది ప్రాధమిక ఆలోచన మాత్రమేనని స్పీకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నాగార్జున వర్సిటీలోని భవనాలను పరిశీలించాక సమావేశాల నిర్వహణకు అనువుగా ఉందనుకుంటేనే ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. దానిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవలసి ఉంటుందన్నారు.

>
మరిన్ని వార్తలు