నయవంచన

9 Sep, 2015 04:00 IST|Sakshi
నయవంచన

- ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసగించిన మామ
- కాళ్లావేళ్లాపడినా కనికరించని వైనం
- ఆపై మూడు నెలలుగా ఇంట్లో నిర్బంధం
- చుట్టుముట్టిన వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు
- స్థానికుల చొరవతో రుయాకు తరలింపు
- చికిత్స పొందుతున్న యువతి
తిరుపతి కార్పొరేషన్ :
ఆ విద్యార్థిని కుటుంబం కటిక పేదరికం. అయినా సరే తల్లి ప్రోత్సాహంతో ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసి  ఉన్నత చదువులు కావాలని కలలు కనింది. ఇంతలో మామ వరసయ్యే ఓ కామాంధుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువు పెంచుకున్నాడు. ఆపై ఉడాయించడం తో కళ్ల ముందే ఆశల శౌధం కుప్పకూలింది. చదువు కొనసాగించలేక, ఉన్నత లక్ష్యం చేరుకోలేక, ప్రేమ పేరుతో వంచనకు గురైంది. ఆపై మూడు నెలలుగా గృహ నిర్భంధంలో మానసికంగా చిత్రహింసలు పడింది.

ఎట్టకేలకు స్థానికుల చొరవతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు, బాధితుల కథనం మేరకు... రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లేమార్గంలోని మాతమ్మ గుడి ప్రాంతంలో పి.ఎం.శ్రీనివాసులు, ప్రమీలావతి కాపురం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కాగా కూతురు దివ్యభారతి (19) రేణిగుంటలోని ఓ కళాశాలలో ఇంటర్ మీడియట్ చేరింది. ప్రథమ శ్రేణిలో పాసైంది.
 
ప్రేమ పేరుతో కెరీర్‌కు పుల్‌స్టాప్
ఈ నేపథ్యంలో వరుసకు మామ అయ్యే మాతయ్య (31) దివ్యభారతి ఇంటికి వస్తూ పోతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చనువుగా మెలిగాడు. తన అవసరం తీరాక పెళ్లి చేసుకోలేనంటూ ఖరాకండిగా చెప్పేశాడు. పైగా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయ డం, పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో కుమిలిపోయింది. ఆమె భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
 
మూడు నెలలుగా గృహ నిర్భంధం...
ఇదే క్రమంలో తల్లి ఎలాగైనా తన కూతురుని ప్రేమ ఆలోచనల నుంచి దృష్టి మరల్చాలని ఇంట్లో నిర్భంధించింది. దీంతో మూడు నెలలపాటు బయటి ప్రపంచాన్ని చూడలేక పోయింది. మూడు నెలలుగా గృహ నిర్భంధం కావడంతో మానసిక ఒత్తిడితోపాటు చర్మపు వ్యాధి సోకింది. ఈ విషయమై రుయా ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరిని సంప్రదించగా 15 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొస్తామన్నారు.

మరిన్ని వార్తలు