యనమల రాజీనామా చేయాలి

18 Mar, 2016 02:50 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు..
 

హైదరాబాద్: శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా యనమల తీసుకున్న చర్యలను కోర్టులే తప్పుబట్టాయని, యనమలకి ఒక్క క్షణం కూడా సభలో కూర్చునే అర్హత లేదన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, నారాయణస్వామి, కొరముట్ల శ్రీనివాసులు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సునీల్ కుమార్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అమ్జాద్‌బాషా షేక్ బీపారి, సుజయ్ కృష్ణరంగారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మాట్లాడారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిందన్నారు.హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికారపక్షానికి చెంప పెట్టులాంటిదన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కౌరవ సభలా తయారైందని.. లేనిపోని ఆరోపణలతో రోజాను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. తనకు తాను రాజ్యాంగ నిపుణుడిగా ఊహించుకునే యనమల అహంకార వైఖరితో హైకోర్టు అక్షితలు వేసే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా ఇకపై కుట్రపూరిత చర్యలు మానుకోవాలని ఎమ్మెల్యే నారాయణస్వామి చంద్రబాబుకు హితవు పలికారు.

మహిళలందరికీ రోజా స్ఫూర్తి..
మహిళలందరికీ రోజా స్పూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అమ్జాద్ బాషా షేక్ బీపారి అన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తోందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పువ్వులిచ్చి స్వాగతించాలి
రోజాను సభలోకి రానీయకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం సరికాదని.. ఆమెకు పువ్వులిచ్చి స్వాగతం పలకాలని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. చట్టాలను గౌరవిస్తామని చెప్పే చంద్రబాబు స్వయంగా గేటువద్దకు వెళ్లి పూలబోకేతో ఆమెని ఆహ్వానించాలన్నారు.
 

మరిన్ని వార్తలు