‘గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి’

29 Mar, 2017 15:29 IST|Sakshi
‘గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి’

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సలహామండలి ఏర్పాటులో జాప్యంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ప్రశ్నించారు. రాజ్యసభలో  ఇవాళ ప్రశ్నోత్తరాల సందర్భంగా వనబంధు కల్యాణ్ యోజనపై లేవనెత్తిన ప్రశ్నపై విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటు రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు కింద విధిగా జరగాల్సి ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడచిపోయిందని, అయినప్పటికీ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఆయన ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరామ్ ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెబుతూ ఏ రాష్ట్రంలోనైనా గిరిజన సలహా మండలి ఏర్పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతుంది. సలహా మండలిలో ఏజెన్సీ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటారని, దీనిపై కేంద్రం ఆయా రాష్ట్రాలతో ప్రతి ఏడాదీ రెండుసార్లు సంప్రదింపులు జరగాల్సి ఉంది. ఆ విధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.​

కాగా ఏపీలో గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లోని 4వ పేరా ప్రకారం గిరిజన సలహా మండలి ఏర్పాటు అనేది తప్పనిసరి అంశం. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా ఆ ఊసేలేదు.  కాగా వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గిరిజన సలహా మండలిని నియమిస్తే అందులో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉంటారనే ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

మరిన్ని వార్తలు