అగ్రసేన్ బ్యాంక్ విస్తరణ..

15 Jan, 2016 02:19 IST|Sakshi
అగ్రసేన్ బ్యాంక్ విస్తరణ..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సహకార బ్యాంకింగ్ రంగంలో ఉన్న అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తన శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం జంట నగరాల్లో 4 శాఖలను నిర్వహిస్తున్న ఈ సంస్థ మార్చికల్లా అత్తాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో అడుగు పెడుతోంది. 2016-17లో మరో 10 బ్రాంచ్‌లను తెరుస్తామని బ్యాంకు సీఈవో ఏ.కె.గోయల్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ విస్తరణ పూర్తి అయితే ఇతర నగరాలకు విస్తరించేందుకు ఆర్‌బీఐకి దరఖాస్తు చేస్తామన్నారు. వ్యాపారానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో శాఖలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
 
 షెడ్యూల్డ్ బ్యాంకు లెసైన్సుకు..
 వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.750 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ లక్ష్యానికి చేరుకున్నాక షెడ్యూల్డ్ బ్యాంకు లెసైన్సుకు ఆర్‌బీఐకి దరఖాస్తు చేస్తామని గోయల్ వెల్లడించారు. నికర నిరర్ధక ఆస్తులు 1.98 శాతానికి దిగొచ్చాయని, దీనిని మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. 2015-16లో రూ.600 కోట్ల వ్యాపారాన్ని బ్యాంకు ఆశిస్తోంది.
 
 కస్టమర్లకు మరింత చేరువగా..
 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రత్యేక క్యాంపెయిన్‌ను అగ్రసేన్ బ్యాంకు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్యాపారం నమోదు చేయాలన్నది సంస్థ లక్ష్యం. ఈ కార్యక్రమం కింద కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణం మంజూరు చేస్తామని సంస్థ చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియా తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు