లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థకు ముప్పు

11 May, 2020 20:19 IST|Sakshi

లాక్‌డౌన్‌ పొడిగింపు పేదలతో చెలగాటమే..

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తే దేశంలో ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడగలిగినా, దీన్ని మరింత పొడిగిస్తే సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కష్టాలను తీవ్రతరం చేస్తుందని అన్నారు. వృద్ధి చెందుతూ, చురుకుగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ జీవనోపాథికి రోగనిరోధక వ్యవస్థ వంటిదేనని అన్నారు. లాక్‌డౌన్‌ ఆ వ్యవస్థను నీరుగార్చి సమాజానికి ముప్పుగా పరిణమిస్తుందన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచుతూ పెద్ద ఎత్తున టెస్టింగ్‌, ట్రేసింగ్‌ చేపట్టాలని ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు.

కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి నెమ్మదించినా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరగడం భారీ జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో అప్పుడే వైరస్‌ రేటు మందగించడం సాధ్యం కాదని చెప్పారు. టెస్ట్‌ల సంఖ్య పెరగడంతోనే కేసుల సంఖ్య ఊపందుకుందని అభిప్రాయపడ్డారు. కేసుల సంఖ్య పెరగడంతో లాక్‌డౌన్‌ ఉపకరించలేదని అనడం సరికాదని చెప్పుకొచ్చారు. కరోనాపై ఉమ్మడి పోరుతో భారత్‌ లక్షలాది మరణాలను నివారించగలిగిందని అన్నారు. భారత్‌లో ప్రతి పది లక్షల మందిలో మరణాల రేటు 1.4 కాగా, ప్రపంచ సగటు 35, అమెరికాలో 228గా ఉందని గుర్తుచేశారు. వైద్య మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు మనకు సమయం పట్టిందని చెప్పారు.వైరస్‌తో మనం జీవించక తప్పదని..అది టూరిస్ట్‌ వీసాతో ముగిసే గడువుతో ఇక్కడకు రాలేదని గుర్తుపెట్టుకోవాలని ఆయన ట్వీట్‌ చేశారు.

చదవండి : పార్కింగ్‌ చేయడానికి సూపర్‌ ఐడియా..

మరిన్ని వార్తలు