ప్రాచీన కళాఖండాలూ.. పెట్టుబడికి మార్గాలే!

22 Aug, 2016 00:02 IST|Sakshi
ప్రాచీన కళాఖండాలూ.. పెట్టుబడికి మార్గాలే!

దీర్ఘకాలంలో ఈక్విటీల్లాంటి రాబడి
అభిరుచి ఉన్నవారికి చక్కని అవకాశం


శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి తల పాగా కావచ్చు. పికాసో వేసిన అపురూపమైన చిత్రం కావచ్చు. గాంధీ వాడిన చేతి కర్ర కావచ్చు. ప్రాచీన కళాఖండాలు, కళాత్మక, అరుదైన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంటుందనేది సత్యం. వీటిపై పెట్టే పెట్టుబడులు ఈక్విటీలు, రియల్టీలకు తీసిపోకుండా బ్రహ్మాండమైన రాబడులను కూడా అందిస్తాయన్న విషయం తెలుసా...? మరి వీటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ముందు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.


గుర్తింపు ఉన్న డీలర్లు..
ప్రాచీన వస్తువులు, కళాఖండాలను గుర్తింపు ఉన్న డీలర్ ద్వారానే కొనుగోలు చేయడం క్షేమం. ఎందుకంటే కొనే వస్తువు నిజంగా పాత కాలం నాటికి చెందినదేనా...? కాదా...? దాన్ని వారు అధికారికంగానే విక్రయిస్తున్నారా? అలా విక్రయించడానికి వారికి అనుమతి ఉందా? ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంది.


ఇష్టపడితేనే..
లాభం దృష్టితో ఏదో ఒకదాన్ని కొనేయడం కాదు. డెకరేటివ్ ఆర్ట్,  ఫర్నిచర్, మరో అలంకరణ, అరుదైన వస్తువు...  ఇలా ఏదైనా కావచ్చు. వేల సంవత్సరాల క్రితం నాటి ఆట వస్తువు కావచ్చు. కూర్చునే కుర్చీ కావచ్చు. వీటిలో ఏది కొనాలన్న దానిపై స్పష్టత ఉండాలి. పైగా ఇష్టపడితేనే కొనాలనేది నిపుణుల సూచన. ఇందుకోసం తగినంత శోధన చేయడం పెట్టుబడి నిర్ణయాలను లాభదాయకం చేస్తుంది.


డిమాండ్ దేనికి...?
పురాతన కళాఖండాల మార్కెట్‌కు, మిగిలిన మార్కెట్లకు పోలికలున్నాయి. ఇక్కడ కూడా ఆటుపోట్లు ఉంటాయి. అందుకే బాగా డిమాండ్ ఉండి, తక్కువ లభ్యత ఉన్న వాటిపై పెట్టుబడులు పెడితే స్థిమితంగా ఉండొచ్చు. ఫలానా వాటికే డిమాండ్ ఉన్నదనే విషయం తెలుసుకునేందుకు ఇటీవల వేలం వివరాలను సంబంధిత సంస్థల వెబ్‌సైట్లను ఆశ్రయించడం ద్వారా ఏ ఉత్పత్తులు అధికంగా అమ్ముడయ్యాయి, వేటికి డిమాండ్ అధికంగా ఉందన్న వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అరుదుగా లభించే వస్తువులపై పెట్టుబడులైతే మంచి రాబడినిస్తాయి. ఒకవేళ పాత కాలం నాటి ఆభరణాల్లో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటే డిజైన్ పరంగా ప్రత్యేకంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది.

 
కంటికి కనిపించని లోపాలు...

ఓల్డ్ ఈజ్ గోల్డే. కానీ, ఎక్కడో చిన్న లోపం. తెలివిగా వాటిని కనిపించకుండా విక్రయదారులు తమ నైపుణ్యానికి పని చెబుతారు. అందుకే వేలంలో కొనే ప్రాచీన వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిగానీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోకూడదు.

 
బీమా అవసరం...

ప్రాచీన వస్తువు ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దానిపై బీమా తీసుకోవడం తప్పనిసరి. అధిక విలువ ఉన్నవి అయితే, దానిపై విలువ మదింపు సర్టిఫికెట్లను బీమా సంస్థలు అడుగుతాయి. అలాగే, నిర్ణీత విలువ ఉంటేనే బీమా అవకాశం కల్పిస్తున్నాయి. బీమా సంస్థ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు.

 
ఆర్ట్ ఇండెక్స్‌లు
స్టాక్ మార్కెట్‌లకు సూచీలున్నట్టే... వరల్డ్ ఆల్ ఆర్ట్ ఇండెక్స్, మీ మోసెస్ ఫ్యామిలీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇండెక్స్ వంటి సూచీలు కూడా ఉన్నాయి. స్టాక్స్ ధరల పెరుగుదలను సూచీలు ప్రతిబింబించినట్టే... పురాతన వస్తువుల ధరల పెరుగుదలను ఈ సూచీల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒకసారికి మించి అమ్మడుపోయిన ప్రతీ వస్తువు ధరను ట్రాక్ చేయడం ద్వారా నిర్ణీత కాలంలో ఎంత మేర రాబడులు ఇచ్చాయన్నది పోల్చి చూపిస్తాయి.

 
వరల్డ్ ఆల్ ఆర్ట్ ఇండెక్స్ గత 60 ఏళ్ల రాబడులను పరిశీలిస్తే ఈక్విటీల కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయినా, స్టాక్స్‌పై పెట్టుబడుల పట్ల కొందరు సుముఖంగా ఉండకపోవచ్చు. కళాత్మక వస్తువుల పట్ల మక్కువ ఉండవచ్చు. అలాంటి వారికి ఈ మార్కెట్ బాగా పనికొస్తుంది.


పెట్టుబడి పెట్టేముందు ఒక్కసారి...
దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఆర్ట్, ప్రాచీన వస్తువులు మంచి అప్షన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్టాక్ మార్కెట్ అయితే నగదు అవసరం ఏర్పడితే వెంటనే అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చు. కానీ, ప్రాచీన వస్తువుల మార్కెట్లో ఇలా ఉండదు. కొనుగోలు దారులు కొద్ది మందే ఉంటారు. అందుకే అవసరం వచ్చినప్పుడు వెంటనే నగదు చేసుకోవడం వీలు కాకపోవచ్చు. పైగా లావాదేవీలపై చార్జీలు కూడా అధికంగా ఉంటాయి. అయితే, దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలను అందిస్తుందని చరిత్ర చెబుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు