రూ.450 కోట్లు సమీకరిస్తున్న అపోలో

19 Oct, 2016 00:52 IST|Sakshi
రూ.450 కోట్లు సమీకరిస్తున్న అపోలో

దీనికోసం అపోలో హెల్త్‌లో వాటా విక్రయం
సంస్థ జేఎండీ సంగీత రెడ్డి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ అనుబంధ కంపెనీ అపోలో హెల్త్, లైఫ్‌స్టైల్ రూ.450 కోట్ల నిధులను సమీకరిస్తోంది. ప్రయివేటు ఈక్విటీ రూపంలో ఈ నిధులను సమీకరిస్తున్నామని, వీటిని కంపెనీ విస్తరణకు ఉపయోగిస్తామని అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టరు సంగీత రెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అపోలో క్లినిక్స్, అపోలో షుగర్, అపోలో డయాగ్నాస్టిక్స్, అపోలో వైట్, అపోలో డయాలసిస్, అపోలో క్రాడిల్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌ను అపోలో హెల్త్, లైఫ్‌స్టైల్ నిర్వహిస్తోంది.

 క్లినిక్స్ రెట్టింపు...
మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అయిన అపోలో క్లినిక్స్‌కు ప్రస్తుతం భారత్‌తోపాటు పలు దేశాల్లో 78 శాఖలున్నాయి. క్లినిక్స్ విస్తరణపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తామని సంగీత రెడ్డి తెలిపారు. మూడేళ్లలో వీటి సంఖ్యను రెండింతలు చేయనున్నట్టు వెల్లడించారు. తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రాడిల్ కేంద్రాలు ప్రస్తుతం 7 ఉన్నాయి. 2019 నాటికి మరో 13 రానున్నాయి. ముంబైలో ఏర్పాటవుతున్న 600 పడకల అపోలో ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కానుంది. దీంతో సంస్థ పడకల సంఖ్య 10,200లకు చేరనుంది.

 చెన్నైలో సదస్సు..
దేశంలో ఆరోగ్య సేవల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం పూర్తిగా వినియోగంలోకి రాలేదని సంగీత రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మింగ్ హెల్త్‌కేర్ విత్ ఐటీ, పేషంట్ సేఫ్టీ కాంగ్రెస్ పేరుతో సదస్సులను చెన్నైలో అక్టోబరు 21-22న అపోలో నిర్వహిస్తోందని చెప్పారు. రోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు. సదస్సుకు 15 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.

>
మరిన్ని వార్తలు