5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్

29 Mar, 2016 18:00 IST|Sakshi
5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్

42 ఏళ్ల తర్వాత నేరుగా కార్గో సేవలు ఆరంభం
30 నుంచి 5 రోజులకు తగ్గిన రవాణా సమయం
25-50 నుంచి శాతం తగ్గనున్న వ్యయం
పత్తి రైతులకు లాభం: పోర్టు సీఈఓ


కృష్ణపట్నం పోర్టు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ; బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టానికి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు వేదికగా నిలిచింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత సోమవారం వాస్తవ రూపం దాల్చింది. గతేడాది ప్రధాని నరేంద మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి హార్బర్ నౌక ఈ నెల 23న బయలుదేరి సోమవారం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్‌గాన్ రేవుకు పంపుతున్నారు.

పత్తి బేళ్ల లోడింగ్ అనంతరం ఈ నౌక మంగళవారం బయలుదేరి, ఏప్రిల్ 3న పన్‌గాన్ పోర్టుకు చేరుతుంది. నౌకలోకి పత్తి లోడింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.జానకి లాంఛనంగా ప్రారంభించారు. బంగ్లా ఎంపీ నూర్ ఏ అలామ్ చౌదురీ, ‘నీసా పారిబహాన్’ ఎండీ నాసిర్ అహ్మద్ చౌదురి, సీఈఓ సిరాజుర్ రెహ్మాన్, పన్‌గాన్ పోర్టు ఇన్‌ల్యాండ్ కంటైనర్ టెర్మినల్  మేనేజర్ అహ్మదుల్ కరీమ్ చౌదురి, కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి, కస్టమ్స్ అధికారులు కేక్ కట్ చేసి, ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడుతూ... ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌కు నౌకల ద్వారా సరుకులు పంపించాలంటే శ్రీలంక, సింగపూర్ దేశాలు మీదుగా వెళ్లాల్సి వచ్చేదని, ఇందుకు 25 నుంచి 30 రోజుల సమయం పట్టేదని తెలియజేశారు. ‘‘ఇప్పుడు నేరుగా సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల కేవలం ఐదు రోజుల్లో బంగ్లాదేశ్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల సమయంతో పాటు రవాణా వ్యయం కూడా 25 నుంచి 50 శాతం వరకు కలసి వస్తుంది’’ అని తెలియజేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ రేవు ద్వారా తూర్పు తీర రాష్ట్రాలకు నేరుగా సరుకు రవాణా చేసే వెసులుబాటు కలిగిందన్నారు.

వస్త్రాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న బంగ్లాదేశ్ భారీగా పత్తిని దిగుమతి చేసుకుంటోందని, ఇలా దిగుమతి చేసుకుంటున్న పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 14 శాతంగా ఉందని తెలియజేశారు. ఈ జల రవాణా లింకు ఏర్పడటం వల్ల స్థానిక పత్తి రైతులకు ప్రయోజనం క లుగుతుందన్నారు. అలాగే మిరప, పప్పు దినుసులు ఎగుమతి చేయడమే కాకుండా నేరుగా జనపనార బస్తాలను దిగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు నూర్ ఆలమ్ చౌదరి మాట్లాడుతూ ఢాకాకు సమీపంలో టెక్స్‌టైల్ కంపెనీలకు కావాల్సిన ముడిసరుకును పన్‌గాన్‌లోని నదీ రేవు మార్గం వరకు నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. రోడ్డు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా, విలువైన సమయం కాపాడుకుంటూ తక్కువ రేటుతో సరుకు రవాణా చేసుకోవచ్చన్నారు.

 ఇండియాలోని ఇతర రేవు పట్టణాలతో నేరుగా రవాణా పెంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. అనంతరం ‘నీసా పారిబహాన్’ ప్రతినిధులు తమ దేశంలో ఓడ రేవుల ద్వారా సాధిస్తున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎగుమతిదారుల సందేహాలను పోర్టు సీఈఓ నివృత్తి చేశారు.

>
మరిన్ని వార్తలు