బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.1,156 కోట్లు

13 Nov, 2018 00:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను చవిచూసింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.179 కోట్లు, ఈ క్యూ1లో రూ.95 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.11,600 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.10,800 కోట్లకు తగ్గిందని తెలిపింది.  

తగ్గిన రుణ నాణ్యత...
గత క్యూ2లో రూ.49,307 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.61,561 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. నికర మొండి బకాయిలు రూ.23,566 కోట్ల నుంచి రూ.25,994 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఇక శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 12.62 శాతం నుంచి 16.36 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 6.47 శాతం నుంచి 7.64 శాతానికి పెరిగాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

అయితే ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.66 శాతంగా, నికర మొండి బకాయిలు 8.45 శాతంగా ఉన్నాయని, సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల, నికర  మొండి బకాయిలు తగ్గాయని వివరించింది.  మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,867 కోట్ల నుంచి రూ.2,828 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ2లో నికర నష్టాలు భారీగా రావడంతో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 4.8 శాతం నష్టంతో రూ.87 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు