ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు విలీనం

21 Mar, 2017 00:20 IST|Sakshi
ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు విలీనం

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ అగ్రగామి ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ) సైతం కలసిపోనుంది. ఈ దిశగా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ బ్యాంకు సేవలను మరింత మంది మహిళలకు వేగంగా అందించేందుకు వీలుగా బీఎంబీని ఎస్‌బీఐలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం  పేర్కొంది. ఎస్‌బీఐకి  ఉన్న భారీ నెట్‌వర్క్‌ తదితర అనుకూలతలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది.

ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు సైతం ఏప్రిల్‌ 1న విలీనం అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు బీఎంబీని కూడా విలీనం చేయాలని గతంలో ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంపైనే అధికారికంగా నిర్ణయం తీసుకుని, బీఎంబీపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా బీఎంబీ విలీనానికి కూడా లైన్‌ క్లియర్‌ చేసింది.

ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు సేవలు
ఎస్‌బీఐలో బీఎంబీ వీలీనానికి కారణాలను సైతం కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. ‘‘ఎస్‌బీఐ గ్రూపు పరిధిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల కోసమే 126 శాఖలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో బీఎంబీకి కేవలం ఏడు శాఖలే ఉన్నాయి. పరిపాలన, నిర్వహణ వ్యయాలు ఎస్‌బీఐ నిర్వహిస్తున్న మహిళా శాఖలతో పోల్చి చూస్తే బీఎంబీకి అధికంగా ఉన్నాయి. అంటే ఒకే ఖర్చుతో మహిళలకు అధిక సంఖ్యలో ఎస్‌బీఐ ద్వారా రుణాలను అందించవచ్చు’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది.

అలాగే, మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, మహిళల కోసం ప్రత్యేకించిన పథకాలను వేగంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందని తన ప్రకటనలో తెలిపింది. బీఎంబీ 2013లో ఏర్పాటైంది. తన శాఖల ద్వారా రూ.192 కోట్ల రుణాలను మహిళలకు పంపిణీ చేసింది. అదే విధంగా ఎస్‌బీఐ గ్రూపు పరిధిలో మహిళలకు ఇచ్చిన రుణాలు రూ.46,000 కోట్లుగా ఉన్నట్టు ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఎస్‌బీఐకి 2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో 22 శాతం మంది మహిళలే.

అనుబంధ బ్యాంకులు ఇకపై ఎస్‌బీఐ శాఖలే: ఆర్‌బీఐ
ముంబై: ఎస్‌బీఐలో విలీనం అవుతున్న ఐదు అనుబంధ బ్యాంకుల శాఖల పేర్లు అంతర్థానం కానున్నాయి.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ కస్టమర్లు, డిపాజిటర్లను ఏప్రిల్‌ 1 నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులుగా పరిగణించనున్నట్టు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా బ్యాంకు శాఖలు ఎస్‌బీఐ శాఖలుగా పనిచేస్తాయని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు