జెట్‌ సంక్షోభం : మరో షాకింగ్‌ న్యూస్‌

12 Apr, 2019 18:12 IST|Sakshi

సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. పీటీఐ సమాచారం ప్రకారం శుక్రవారం మరో మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్‌ 15, సోమవారం దాకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. ఇప్పటికే రెండు రోజులపాటు అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రాను కలవనున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌  సమస్య, పరిష్కాలపై సమీక్షించనున్నారు.

ఇది ఇలా ఉంటే తమకు జీవితాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది ఉద్యోగులు ముంబైలో ర్యాలీ నిర్వహించారు.  తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై యాజమాన్యం తమకు క్లారిటీ ఇవ్వాలని కోరారు.  అంతేకాదు మాజీ ఛైర‍్మన్‌ నరేష్‌ గోయల్‌, సీఈవో వినోద్‌ దువే,  యాజమాన్యంపై లేబర్‌  చట్టం ప్రకారం కేసు నమోదు చేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. 

25 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్‌ దేశీయంగా కూడా 10 విమానాలను రద్దు చేసింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించలేక నిలిపి వేసిన విమానాల సంఖ్య 79కి చేరింది. మరోవైపు అనూహ్యంగా జెట్‌ విమానాలను రద్దు చేయడంతో విమాన ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కోలకతా, ముంబై విమానాశ్రయాల్లో టికెట్ల డబ్బులు రిఫండ్‌ కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో  విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే  క్యాన్సిల్‌ అయిన టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణీకులు వాపోయారు. అసలు దీనిపై నిర్దిష్టమైన సమాచారం ఏదీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న సమస్యను పరిశీలించాల్సిందిగా సివిల్ ఏవియేషన్ మంత్రి సురేష్ ప్రభు నేడు (శుక్రవారం) పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను  ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ సమస్యను చక్కదిద్దాలంటూ సురేష్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. మరోవైపు  జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాల కొనుగోలుకు బిడ్లకు సమర్పించేందుకు గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. 

మరిన్ని వార్తలు