స్విగ్గీలో నూడుల్స్‌ ఆర్డర్‌ చేస్తే..

12 Feb, 2019 15:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆన్‌లైన్‌ ద్వారా ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకునే వారికి మరో షాకింగ్‌ న్యూస్‌.  మొన్న జొమాటో డెలివరీ బాయ్ మధ్య దారిలో.. కస్టమర్ ఫుడ్‌ను తింటూ కెమేరాకు చిక్కిన వైనాన్ని ఇంకా మర్చిపోక ముందు మరో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ నిర్వాకం కలకలం రేపింది.  స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేసిన ప్యాక్‌లో బ్యాండేజ్‌ దర్శనమివ్వడంతో సదరు కస‍్టమర్‌కు వాంతులు ఒకటే తక్కువ. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన బాలమురుగన్ స్విగ్గీ ద్వారా సెలైయూర్‌ సమీపంలోని ‘చాప్ ఎన్ స్టిక్స్’ చైనీస్ రెస్టారెంట్ నుంచి చికెన్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. వేడి వేడి ప్యాకెట్‌ ను చూడగానే నోరూరింది. వెంటనే పార్శిల్ తెరిచి ఆరగిస్తుండగా అందులో రక్తంతో తడిచిన బ్యాండేజ్ కనిపించింది. దీంతో షాకైన బాలమురుగన్ వెంటనే ఆ రెస్టారెంట్‌కు ఫోన్‌చేసి ప్రశ్నించాడు. అయితే, ఆ హోటల్ వారు ఫుడ్ రీప్లేస్ చేయడానికి అంగీకరించలేదు. రిఫండ్ కూడా ఇవ్వమని కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే, స్విగ్గీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడేందుకు ఫోన్ నెంబరు లేదు. దీంతో చాటింగ్ ద్వారా మాత్రమే మురుగన్ స్విగ్గీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం శూన్యం.

దీంతో దిక్కుతోచని మురుగన్‌ ఫేస్‌బుక్‌లో స్విగ్గీ పేజ్‌‌లో తన కంప్లయింట్ పోస్ట్ చేశాడు. తాను ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో బ్లడ్ బ్యాండేజ్ ఉంది. దీనిపై తక్షణమే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని భావిస్తున్నాననీ, వివిధ హోటళ్లతో భాగస్వామ్యం విషయంలో స్వీగ్గీ మరింత అప్రమత్తంగా ఉంటూ లోపాలను సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల తనకేమైనా అనారోగ్యం సోకితే  కంపెనీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ఇది వైరల్‌ కావడంతో చివరికి స్విగ్గీ దిగి రాకతప్పలేదు. వినియోగదారుడికి ఎదురైన అనుభవంపై చింతిస్తున్నామంటూ ఆయనకు క్షమాపణలు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత మాకు ఎంతో ముఖ్యం. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని బాధితుని ఫిర్యాదు మేరకు రెస్టారెంటును మా జాబితా నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది దీనిపై  థర్డ్ పార్టీ  విచారణ జరుపుతామని పేర్కొంది.

మరిన్ని వార్తలు