మహిళలకు వేతనాలు తక్కువే!

13 Oct, 2014 00:52 IST|Sakshi
మహిళలకు వేతనాలు తక్కువే!

* భారతీయ ఐటీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ నివేదిక
* పురుషులతో పోలిస్తే వ్యత్యాసం పెరుగుతోందని వెల్లడి
న్యూఢిల్లీ: భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వేతనాల పెంపు విషయంలో మహిళలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉదంతం నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆరంభంలో ఒకే స్థాయి వేతనాలతోనే మహిళ, పురుష ఉద్యోగులు తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నప్పటికీ.. కొంతకాలానికి వేతనాల్లో వ్యత్యాసం ఎగబాకుతోందని కెటలిస్ట్ ఇండియా డబ్లూఆర్‌సీ అనే సంస్థ తన అధ్యయన నివేదికలో పేర్కొంది.

మహిళలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. కాగా, నాదెళ్లలాంటి దిగ్గజ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని.. అయితే, తన తప్పును వెంటనే అంగీకరించి ఆయన క్షమాపణ చెప్పడం గొప్పవిషయమని కెటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ షాచి ఇర్డే పేర్కొన్నారు. సుమారు 58 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది.

అన్నిరంగాల్లోనూ...: వ్యాపారం, ఆర్థిక రంగం, సామాజిక రంగం ఇలా మగాళ్లకు అవకాశాలున్న ప్రతిచోటా మహిళలకూ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఇర్డే అన్నారు. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా.. ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోందని కెటలిస్ట్ గ్లోబల్ రీసెర్చ్ పేర్కొంది. ‘భారత్ విషయానికొస్తే... టెక్నాలజీ రంగంలో మేం చేసిన అధ్యయనం ప్రకారం మహిళలు-పురుషులు ఇద్దరూ ఒకే విధమైన బాధ్యతలు, వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే, కొంతకాలం గడిచేసరికి వేతనాల్లో తేడా భారీగా ఉంటోంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌ను చూస్తే.. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు సుమారు రూ.3.8 లక్షల మేర వేతన వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడాను తొలగించేందుకు నాయకత్వపరమైన, పటిష్ట చర్యలు అవసరం’ అని ఇర్డే వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు