ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

21 Aug, 2019 08:35 IST|Sakshi

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసులో చుక్కెదురు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసుకు సంబంధించి ఆడిటింగ్‌ సంస్థలు డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌కు నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్‌ నిరాకరించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫ్రాడ్‌ కేసులో ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్‌ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది ఉత్తర్వులేవీ జారీ చేయబోమని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ ఆడిటింగ్‌ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను రెండు సంస్థలపైనా అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ డెలాయిట్, బీఎస్‌ఆర్‌ తాజాగా ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దాదాపు రూ. 95,000 కోట్ల మేర రుణాలు బాకీపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు