ఎకానమీకి వైరస్‌!!

13 Feb, 2020 06:01 IST|Sakshi

ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు కట్‌

2.2 శాతానికి కుదించిన ఈఐయూ

కోవిడ్‌–19 వైరస్‌ భయాలే కారణం

న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. ‘ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ పేర్కొంది. వాణిజ్య యుద్ధ భయాల మూలంగా 2019లో ప్రపంచ వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే.

యూరోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, అమెరికా.. చైనాలతో పాటు భారత్‌లోనూ స్థూల దేశీయోత్పత్తి మందగించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గి, కొత్త ఏడాదిలో పరిస్థితులు చక్కబడవచ్చని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా కరోనా వైరస్‌ తెరపైకి రావడం గమనార్హం. చైనా హుబెయ్‌ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో బైటపడిన ఈ వైరస్‌ ఆ దేశంతో పాటు ఇతరత్రా పలు దేశాలకు కూడా విస్తరించడం ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. వైరస్‌ ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘మార్చి ఆఖరు నాటికల్లా వైరస్‌ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం‘ అని ఈఐయూ తెలిపింది.  

భారత్‌పై బుల్లిష్‌..: ప్రపంచ ఎకానమీ, చైనా విషయంలో నిరుత్సాహపర్చే అంచనాలు ప్రకటించిన ఈఐయూ.. భారత్‌పై మాత్రం బులిష్‌ ధోరణి కనపర్చింది. కరోనా వైరస్‌ తాకిడి భారత్‌లో గణనీయంగా విస్తరించని పక్షంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉండగలదని పేర్కొంది.

మరిన్ని వార్తలు