ఫేస్‌బుక్‌ సైతం ఆ కరెన్సీని తెచ్చేస్తోంది..

12 May, 2018 13:15 IST|Sakshi

టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు తెలిసింది. తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని అన్వేషిస్తున్న ఫేస్‌బుక్‌, కొత్త బ్లాక్‌ చెయిన్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఈ టెక్నాలజీ ఆధారిత అవకాశాలను అన్వేషించే బాధ్యతల్ని వారికి అప్పగించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఫేస్‌బుక్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు టెక్‌ వెబ్‌సైట్‌ చెడార్‌ రిపోర్టు చేసింది. 

ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. క్రిప్టోకరెన్సీని లాంచ్‌ చేసి, బిట్‌కాయిన్‌ తరహాలో వర్చ్యువల్‌ కరెన్సీ ద్వారా పేమెంట్లు జరిపేలా అనుమతి ఇవ్వనుంది.’’ఫేస్‌బుక్‌లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని అన్వేషించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశాం’  అని ఫేస్ బుక్ మెసెంజర్‌ ఎగ్జిక్యూటివ్ ఇంఛార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు. ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు  అన్వేషిస్తుందని కంపెనీ సైతం ప్రకటించింది. 

తాము ఏర్పాటు చేసిన చిన్న టీమ్‌ భిన్నమైన అప్లికేషన్లను అన్వేషించడంపై దృష్టి పెట్టనుందని తెలిపింది. ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది. 2018లో బ్లాక్‌చెయిన్‌ సొల్యూషన్లు 2.1 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 2017 కంటే ఇది రెండింతలు ఎక్కువ అని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై పనిచేసేందుకు ఫేస్‌బుక్‌ కొత్త టీమ్‌ను అభివృద్ధి చేసిందని రీకోడ్‌ కూడా రిపోర్టు చేసింది. న్యూ ప్లాట్‌ఫామ్స్‌, ఇన్‌ఫ్రా కింద ఈ బ్లాక్‌చెయిన్‌ టీమ్‌ వస్తోంది. దీన్ని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మైక్‌ ష్రోఫెర్ నడిపించనున్నారు. ష్రోఫెర్‌నే ఫేస్‌బుక్‌ ఏఆర్‌, వీఆర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ కార్యకలాపాలను చూసుకోనున్నారు. 

>
మరిన్ని వార్తలు