ఫెడ్‌ రేట్ల పెంపు భయాలతో నష్టాలు 

1 Mar, 2018 01:00 IST|Sakshi

162 పాయింట్లు పతనమై 34,184కు సెన్సెక్స్‌

61 పాయింట్ల నష్టంతో 10,493కు నిఫ్టీ 

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు భయాలతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం 44 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 162 పాయింట్లు పతనమై 34,184 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  10,500 దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 10,462 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ చివరకు 61 పాయింట్ల నష్టంతో 10,493 పాయింట్ల వద్ద ముగిసింది.  భవిష్యత్‌ రేట్ల పెంపు తథ్యమన్నట్లుగా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం,  బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగడం.. మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు స్వల్పంగా తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్‌ 34,157 పాయింట్ల వద్ద నష్టాలతో ఆరంభమైంది. విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనతో అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో 270 పాయింట్ల నష్టంతో 34,076 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.  

బ్యాంక్‌ షేర్లు బేర్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రుణ కుంభకోణం నేపథ్యంలో నిర్వహణ, టెక్నికల్‌ రిస్క్‌లకు సంబంధించి ముందస్తు చర్యలను 15 రోజుల్లోగా తీసుకోవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి. యాక్సిస్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2 శాతం మేర నష్టపోయాయి. 

లాభాల్లో పీఎన్‌బీ:గత కొంత కాలంగా నష్టపోతూ వచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ తేరుకుంది. ఇంట్రాడేలో 12.1 శాతం నష్టంతో 20 నెలల కనిష్టానికి, రూ.92కు పడిపోయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ చివరకు 3 శాతం లాభంతో రూ.101 వద్ద ముగిసింది.
 
బీఎస్‌ఈ నుంచి 36 కంపెనీలు డీలిస్ట్‌...
బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌(బీఎస్‌ఈ) నుంచి 36 కంపెనీలు డీలిస్ట్‌ కానున్నాయి. ఈ కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ మూడేళ్లపాటుగా సస్పెండ్‌ కావడంతో వచ్చే వారం (ఈ నెల 5) నుంచి ఈ కంపెనీలను డీలిస్ట్‌ చేస్తున్నామని బీఎస్‌ఈ తెలిపింది.  

మరిన్ని వార్తలు